గణేష్‌ శోభాయాత్రలో విషాద ఘటనలు

` డీజే సౌండ్‌ ధాటికి ఇద్దరు యువకులు హార్ట్‌ఎటాక్‌తో మృతి
` విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు
` కామారెడ్డి,నాగర్‌ కర్నూల్‌లో ఘటనలు
విలేకరుల యంత్రాంగం (జనంసాక్షి):గణేష్‌ నిమజ్జన వేడుకల సందర్భంగా పలు జిల్లాల్లో విషాద ఘటనలు నెలకొన్నాయి. డీజే సౌండ్‌ ధాటికి ఇద్దరు యువకులు గుండెపోటుతో మరణించారు. మరోచోట విద్యుత్‌ తీగలు తగిలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంకోచోట క్రేన్‌ గొలుసు ఒక్కసారిగా ఊడిపోవడం, పోలీసులు భక్తులను వెనక్కి నెట్టేయడంతో పెను ప్రమాదం తప్పింది.కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామంలో డీజే సౌండ్‌ కొనసాగిస్తూ మంగళవారం రాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెబల్‌ స్టార్‌ వినాయక యూత్‌ సభ్యుడు నరేష్‌ (35)కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. బుధవారం ఉదయం మృతిచెందాడు. రామారెడ్డి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే, నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినెపల్లి మండలం పాలెం గ్రామంలో మంగళవారం రాత్రి సమయంలో భారీ శబ్దం వినాయకుడి ఊరేగింపు చేస్తున్నారు. సౌండ్‌ ధాటికి తట్టుకోలేక పానుగంటి మల్లేష్‌ (25) అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి స్నేహితులు జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మల్లేష్‌ కన్నుమూశాడు.  నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలోని సుభాష్‌ నగర్‌ కాలనీ బాలల గణేష్‌ శోభయాత్ర బుధవారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో కొనసాగుతుండగా.. అదే కాలనీలోని ట్రాన్స్‌ ఫార్మర్‌ విద్యుత్‌ తీగలకు తగిలింది. దీంతో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఒకరిని ఉన్నత వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. హైదరాబాద్‌ పరిధిలోని జీడీమెట్ల పరిధి సూరారం కట్టమైసమ్మ లింగంచెరువు దగ్గర గణేష్‌ నిమజ్జనంలో పెనుప్రమాదం తప్పింది. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన క్రేన్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల క్రేన్‌ గొలుసు ఒక్కసారిగా ఊడిపోయింది. అక్కడే ఉన్న జీడీమెట్ల ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రాఘవేంద్ర, వరంగల్‌ పీటీసీ నుంచి బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై భక్తులను వెనక్కి నెట్టేశారు. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.