గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
మల్దకల్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అంగన్వాడి టీచర్లకు ఆదేశించారు.
బుధవారంమల్దకల్ మండలం అమరవాయి,పాలవాయి గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు,బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేందుకు పోషణ మాసం ప్రభుత్వం నిర్వహిస్తున్నదని అన్నారు.అమరవాయి గ్రామంలోని మూడవ అంగన్వాడి కేంద్రం పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోషణ అభియాన్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్నదని,గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నదని తెలిపారు.అంగన్వాడీ సూపర్వైజర్లు కేంద్రాలను సందర్శించి లోటుపాట్లను సరిచేయాలని అన్నారు. గ్రామాలలో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జడ్పీటీసీలు,ఎంపీటీసీలు, సర్పంచులు,మహిళా సంఘాల సభ్యులు భాగస్వాములై నిర్వహించాలన్నారు. గర్భిణీలకు బాలింతలకు తృణధాన్యాలు,ఆకుకూరలు లాంటి పౌష్టికాహారం అందజేయాలన్నారు.బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి సరైన పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరవాయిలో తీవ్ర లోపం, అతి త్రీవ లోపం క్రింద గుర్తించినపిల్లలకు తప్పని సరిగా బాలామృతం ప్లస్ అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం ప్లస్ ఉదయం ,సాయంత్రం, పిల్లలకు ఇవ్వాలన్నారు.అంగన్వాడీ కేంద్రం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని,కంపచెట్లు ఉంటే తొలగించాలని సర్పంచుకు ఆదేశించారు.గర్భవతులు పండ్లు,ఆకుకూరలు ఐరన్ ఉండే విధంగా పౌష్టికాహారం తీసుకోవాలని,కాన్పుకు కాన్పుకు మధ్య కనీసం రెండు సంవత్సరాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని గర్భవతులకు ఆదేశించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా అందజేసే సరుకులను గర్భవతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.సన్న బియ్యం రావడం లేదని,దొడ్డు బియ్యం వస్తున్నాయని వారు తెలిపారు.అనంతరం బిఎల్వోలతో మాట్లాడుతూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం ఎంతమందిని చేశారని ప్రశ్నించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఒకవ్యక్తి ఆధార్ నెంబర్ తీసుకొని స్వయంగా ఓటర్ ఐ డి కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేశారు. అమరవాయి లో ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ను తనిఖీ చేశారు.మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పిల్ల లకు ఆకుకూరలు పెట్టాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
అనంతరంపాలవాయి గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని,ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల ను తనిఖీ చేశారు.పాఠశాలలో కిచెన్ షెడ్ ,మరుగుదొడ్లను పరిశీలించారు.భోజనం చేయడానికి డైనింగ్ హాల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భోజనం నాణ్యవంతంగా వండి పెట్టాలని వంట ఏజెన్సీ వారికి ఆదేశించారు.ప్రాథమిక పాఠశాల ఆవరణ ముందు నీరు నిలువ ఉండడం చూసి ఆగిన నీటిలో దోమలు చేరతాయని,దోమల వల్ల పిలలకు ఇబ్బందులు కలుగుతాయని,నీటి నిలువ ఉన్నచోటమొరం వేయించాలని కలెక్టర్ ఆదేశించారు.పాలవాయి హెల్త్ సబ్ సెంటర్ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఫ్లోరింగ్,టైయిలెట్స్ ,త్వరగా పనులు పూర్తి చేయాలని పంచాయతి అధికారులకు ఆదేశించారు.దౌదర్ పల్లి సమీపంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యార్థినులకు సరైన భోజనం అందుతున్నదా,లేదా విద్యార్థినులనుఅడిగి తెలుసుకున్నారు.డైనింగ్ హాల్, కిచెన్,మరుగుదొడ్లు తదితర వసతులు ఉన్నాయా లేదా కలెక్టర్ పరిశీలించారు.ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.సొంత భవనం లేదని ప్రిన్సిపాల్ రేఖ గౌతం కలెక్టర్ కు వివరించారు.పిల్లల బాగా చదువుకొని ఉన్నత స్తాయి చేరుకోవాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ అధికారి ముసాయిదా బేగం,పిఆర్ ఈ ఈ సమత,సిడిపిఓ కమలాదేవి,సర్పంచులు పద్మమ్మ, శివరాం రెడ్డి, ఎంపిటిసి గోపాల్ రెడ్డి, పంచాయతీరాజ్ డిఇ రవీందర్, ఏఈ భరత్ రెడ్డి, ఎంఈఓ కొండారెడ్డి,పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, హెడ్మాస్టర్ జానకమ్మ, విజయలక్ష్మి, శ్రీనివాసులు, సూపర్వైజర్లు నాగరాణి అంగన్వాడీ టీచర్లు తిమ్మమ్మ, పద్మ ,యశోదమ్మ తదితరులు పాల్గొన్నారు.