గల్లి నుంచి ఢిల్లీదాక తెలంగాణ లొల్లి


సంసద్‌యాత్ర చేపడుతాం హస్తినలో రెండు రోజుల దీక్ష
గ్రామస్థాయిలో జేఏసీ కమిటీలు
పార్లమెంట్‌లో బిల్లు కోసం విపక్ష నేతలను సంప్రదిస్తాం : కోదండరామ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి):
తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని తెలంగాణ జెఎసి విస్తృత సమావేశం నిర్ణయించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమా వేశంలో రానున్న మూడు నెలల్లో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. అనం తరం తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరాం మీడియాతో మాట్లాడు తూ, వచ్చే మూడు నెలల్లో తెలంగాణ ఉద్యమాన్ని మరింత తీవ్రంచేస్తామని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా సంపూర్ణ సన్‌సది యాత్రను నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకుగానూ రెండు రోజులపాటు ఢిల్లీలో ధర్నాలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలుపుతూ జాతీయస్థాయి పార్టీల నేతలనుకలుస్తామని అన్నారు. మే రెండ వారంలో విజయవాడ సడక్‌బంద్‌ను నిర్వహిస్తామని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడే విజయవాడ సడక్‌ బంద్‌తో పాటు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సాధన కోసం తాము నిర్వహించబోయే కార్యక్రమంలో భాగంగా గ్రామ కమిటీలను పటిష్టపరుస్తామని అన్నారు. వీటితో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని ప్రజల్లో ఎండగడతామని అన్నారు. గ్రామస్థాయి నుంచి జెఎసిని పటిష్టపరిచి అనంతరం ప్రచార యాత్రను చేపడతామని కోదండరాం అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని జూన్‌ నెలలో తీవ్రం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ కోసం టి.కాంగ్రెస్‌ నేతనలు, తెలంగాన టిడిపి నేతలను టార్గెట్‌ చేస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణపై పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. 2009 డిసెంబర్‌ 9 ప్రకటనను తుంగలో తొక్కి తెలంగాణపై కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. ముఖ్యంగా మే 2వ వారంలో నిర్వహించే విజయవాడ సడక్‌ బంద్‌ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహిస్తామని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. వీటికి ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా తోడైందని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తెలంగాణ సాధించుకుంటామన్నారు.