గాంధీ పుట్టిన గుజరాత్‌లో గాడ్సేల దాష్టీకం
వెంటాడుతున్న 2002 కాళరాత్రులు
త్రిశూల్, తల్వార్‌లతో ఉన్మాదుల స్వైరవిహారంవందలాది గృహదహనాలు, అత్యాచారాలు, సామూహిక హత్యలు
అహ్మదాబాద్, (జనంసాక్షి) :
గుజరాత్.. ప్రపంచానికి శాంతిమంత్రాన్ని ప్రబోధించిన మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రం. ఎందరినో మానవతామూర్తులుగా తీర్చిదిద్దిన గడ్డ సరిగ్గా దశాబ్దం క్రితం నెత్తుటితో తడిసి ముద్దయింది. అప్పటి వరకు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న రెండు వర్గాల మధ్య వైరం రాజేయాలని పాలకపక్షం ఎన్నో కుయుక్తులు పన్నింది. అవి ఫలితాన్నివ్వకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగింది. ప్రజల ఆలనాపాలనా చూసుకోవాల్సిన ప్రభుత్వమే వారిపై కత్తిగట్టింది. ఫలితం గోద్రా మారణహోమం. అంతకుముందు జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనాన్ని సాకుగా చూపి మొత్తంగా ఒకవర్గాన్నే గుజరాత్ గడ్డమీది నుంచి తరిమివేయాలని కుట్రలు పన్నింది. 2002 ఫిబ్రవరి 27, శీతాకాలం చివరికి వచ్చినా చలి ఎక్కువగానే ఉంది. అలాంటి ఎముకలు కొరికే చలిలో గుజరాత్ భగ్గుమంది. కొందరు దుండగులు, ఉన్మాదులు చేసిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనాన్ని గోద్రాలోని మొత్తం ముస్లిం వర్గానికి ఆపాదించింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. దొరికిన వారిని దొరికినట్టుగా ఊచకోతకోసేందుకు రంగం సిద్ధం చేసింది. మతోన్మాదం ఊగిపోతున్న వారు నడిరోడ్లపై త్రిశూలాలు, తల్వార్లతో యథేచ్ఛగా తిరుగుతూ కనబడ్డవారినల్లా ఊచకోత కోస్తున్నా కనీసం నివారించే ప్రయత్నాలు చేయలేదు. సర్కారీ సైన్యం అండతోనే ఉన్మాదులు రెచ్చిపోతున్నా మారణహోమాన్ని ఆపలేదు. అంతర్జాతీయ పౌరహక్కుల వేదికలో గొంతెత్తి గగ్గోలు పెట్టిన ఊచకోతను, మారనహోమాన్ని నియంత్రించలేదు మోడీ సర్కారు. ఆ మారణహోమం తాలూకు జ్ఞాపకాలు ఇంకా గుజరాతీలను వెంటాడుతున్నాయి. అప్పుడు ఉన్మాదులు సృష్టించిన మారణకాండ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. పదేళ్లు గడిచినా ఆ దృశ్యాలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుజరాతీలు ఉలిక్కిపడుతున్నారు. ఆ రోజు గల్లంతైన వందలాది మంది ఇప్పటికీ పత్తాలేరు. 11 ఏళ్లు గడిచాయి. ఇక వారు వస్తారన్నా నమ్మకం కూడా వారి కుటుంబ సభ్యులకు లేదు. అయినా వాకిట్లో ఏదైనా చప్పుడైతే ఆ రోజు తప్పిపోయిన తమ వాడు వస్తున్నాడేమోనని ఆశగా తలుపువైపు చూస్తూనే ఉన్నారు. సబర్మతీ ఎక్స్‌ప్రెస్ దహనం, గోద్రా అల్లర్లలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు హత్య చేయబడ్డారని, 223 మంది పత్తాలేకుండా పోయారని పోలీసు రికార్డుల్లో ఉంది. కానీ ఈ లెక్కలు నిజం కావని అందరికీ తెలుసు. రెండు వేలకు పైగా ముస్లింలను ఊచకోత కోశారని, సుమారు వెయ్యి మంది వరకు గల్లంతయ్యారని మీడియా గగ్గోలు పెట్టింది. ఆరోజు మారణ హోమాన్ని గుర్తు చేస్తూ కొందరు గుజరాతీ ముస్లింలు కన్నీటి పర్యంతమయ్యారు. తాము ప్రాణాలు కాపాడుకునేందుకు ఎక్కడో ఓ మూలన నక్కి చూసిన దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా వివరించారు.
నిండు గర్భిణి కడుపును చీల్చి పిండాన్ని ఆయుధంతో బయటికి తీసి కాలుతున్న మంటల్లో పిండాన్ని వేసిన తీరును చెప్పి బోరున రోదించారు.
ఐదేళ్ల పసివాడితో పెట్రోల్ తాగించి వాడి లేత పెదాలపై అగ్గిపుల్లతో మంట అంటిస్తే ఆ చిన్నారి దేహం ఫట్ మని బాంబులా శబ్దం చేస్తూ పేలిపోయిన హృదయ విదాయక దృశ్యాన్ని కళ్లకు కట్టారు.
తల్లుల ముందు పిల్లల్ని, పిల్లల ఎదుట తల్లుల్ని సామూహికంగా చెరిచి ముక్కలుగా నరికి తగులబెట్టిన తీరును వివరించారు.
కన్నవాళ్లను కోల్పోయి పాలు లేక గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారులకు కసిన్ని నీళ్లు కూడా ఇవ్వకుండా మూత్రం తాగించిన ఉన్మాద మూకల దాష్టీకాన్ని చెప్పి గుండెలవిసేలా రోదించారు.
ఇంతటి దారుణ మారనకాండ నుంచి బయటపడి ఊళ్లు, ఇళ్లు వదిలేసి చెట్టుకొకరు, పుట్టకొకరుగా పారిపోయిన వారు ఇంకా తమ తమ గ్రామాలకు చేరుకోలేకపోతున్నారు. తమ వాళ్లను చెరిచి, దారుణంగా చంపి, నిలువ నీడలేకుండా చేసిన శక్తులే రాజ్యమేలుతున్న తరుణంలో గ్రామాల్లోకి వెళ్లి మళ్లీ ప్రశాంతంగా ఉండలేమని, ఉన్న చోటనే కాలం వెళ్లదీస్తామని పలువురు మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. లౌకిక దేశంలోనే మైనార్టీలపై దాడులు జరిగితే గొంతు విప్పని వివిధ పక్షాలు.. మొన్న వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా చెప్పినట్టు గుజరాత్‌ను హిందూ రాజ్యంగా అవతరింప చేసిన తర్వాత తల్తెత్తే పరిస్థితులను ప్రశ్నించలరా? తలచుకుంటునే ఒళ్లు గగుర్పొడుస్తున్న గోద్రా మారణహోమం లాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండాలంటే లౌకికవాద పార్టీలు మైనార్టీల గొంతుకగా నిలబడాలి.