అర్హులందరికీ పథకాలు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాం
ప్రజా ప్రభుత్వం ప్రతీఒక్కరికీ జవాబుదారీగా ఉంటుంది: సీఎం రేవంత్‌
భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కు మధ్య ఉంది
రేషన్‌కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం
గతంలో ఏదీ కావాలన్నా ఎంతటివారైనా ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది
ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారు
కోస్గి మండలం చంద్రవంచలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించి లబ్ధిదారులకు
అందించిన సీఎం రేవంత్‌రెడ్డి
నారాయణపేట బ్యూరో(జనంసాక్షి):తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో మరో ముందడుగు వేస్తూ ఆదివారం నాలుగు సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్తరేషన్‌కార్డుల పంపిణీ పథకాలను ప్రారంభిస్తూ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. మొత్తం 734 మందికి రైతు భరోసా చెక్కులు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.11.80 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘’రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎంతోమంది పేదలు కొత్త రేషన్‌కార్డుల కోసం చూస్తున్నారు. రైతు కూలీలు ప్రభుత్వ అండ కోరుకుంటున్నారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం.. రైతుకు కాంగ్రెస్‌కూ మధ్య ఉంది. రైతులకు ఉచిత కరెంట్‌ను ఇచ్చే పథకాన్ని మొదట అమలు చేసింది.. దేశమంతట రైతులకు రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే’’’’అప్పట్లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఒక్క సంతకంతో దేశమంతా రుణమాఫీ చేశారు. ఇప్పుడు రైతులకు ఒకే విడతలో రూ.2లక్షల వరకూ రుణమాఫీ చేశాం. ఇలా రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదు. దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.21 వేల కోట్లు వేశాం. సాగు ఖర్చులు పెరిగాయని రైతు భరోసా నిధులు పెంచాం. ఏడాదికి ఎకరాకు రూ.12వేలు చొప్పున ఇస్తున్నాం. ఇవాళ ఆదివారం కాబట్టి, రైతు భరోసా డబ్బులు జమకావు. అర్ధరాత్రి 12 దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమఅవుతాయి. భూమిలేని వారిని కూడా ఆదుకోవాలని గతంలో కూలీలు అడిగారు. భూమిలేని వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకువచ్చాం. ఈ పథకం కింద రూ.12వేలు ఇస్తున్నాం.గడిచిన పదేళ్లలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు రాలేదు. గ్రామాల్లో ఎవరికైనా రెండు పడకల గది ఇల్లు వచ్చిందా? పేదలు ఇల్లు నిర్మించుకుంటే రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. గత ప్రభుత్వం పదేళ్ల పాటు రేషన్‌కార్డులు ఇవ్వలేదు. రేషన్‌కార్డు ఉన్న పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తాం. గ్రామ సభల ద్వారా రేషన్‌కార్డులకు దరఖాస్తులు స్వీకరించాం. అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం. గతంలో ఏదైనా కావాలంటే, ఎవరైనా ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రజల దగ్గరకే ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారు. గ్రామాల్లో ప్రజల సమక్షంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోంది’’’’ప్రజా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే.. ఎప్పటికీ వెనక్కి తగ్గదు. తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ చెప్పారు.. ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి.. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. కాళేశ్వరం కూలిపోయినా.. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రతిపక్ష నాయకుడు సభకు రాని దుస్థితి. దీన్ని ఏమనాలి? ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించనప్పుడు ఆ పదవి ఎందుకు? మనం ఎన్నుకున్న సర్పంచ్‌ గ్రామంలో లేకుంటే ఎలా ఉంటుంది? ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే.. ప్రజలను రెచ్చగొడుతున్నారు. మన ప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమలు తేవాలని భావించాను. మాయమాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి పరిశ్రమలు అడ్డుకున్నారు. నా సోదరులు ప్రజా సేవ చేస్తుంటే, ఏ పదవి ఉందని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబంలా మా ఇంట్లో అందరూ పదవులు పొందలేదు. సోదరులు, బంధువులు, అందరికీ పదవులు ఇస్తేనే.. మంచిదా? కుటుంబమంతటికీ పదవులు ఇచ్చి దోపిడీ చేసే వ్యక్తిని కాదు’’ అని రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోంది
` యూజీసీ ద్వారా వీసీల నియామాకాలు సరికాదు
` బీజేపీయేతర రాష్ట్రాలపై మోదీ చిన్నచూపు
` అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
` యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
హైదరాబాద్‌(జనంసాక్షి):వీసీల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే యత్నం జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.యూజీసీ ద్వారా కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం మంచిది కాదన్నారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తి హరించాలని కేంద్రం చూస్తోందని చెప్పారు. ’’వర్సిటీలపై రాష్ట్ర హక్కును కేంద్రం ఎలా తీసుకుంటుంది. కేంద్రం కుట్రలను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే. ఇతర సీఎంలతో కలిసి యూజీసీ నిబంధనలపై పోరాడతాం. యూజీసీ కొత్త నిబంధనలు రాజ్యాంగంపై దాడి వంటివే. రాష్ట్రాలపై కేంద్రం దండయాత్ర చేస్తోంది. ఇలాంటి విధానాలతో రాజ్యాంగం మనుగడ సాగిస్తుందా? అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలోనే అధికార విభజన ఉంది. కేంద్రం తక్షణమే యూజీసీ నిబంధనలు ఉపసంహరించుకోవాలి. కేంద్రం ఒక్కొక్కటిగా రాష్ట్రాల హక్కులు గుంజుకుంటే ఎలా? తీరు ఇలాగే ఉంటే.. రాష్ట్రాలు నామమాత్రం అవుతాయి.పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై వివక్ష చూపింది. రాష్ట్రం సిఫార్సు చేసిన వారికి పురస్కారాలు ఇవ్వలేదు. గద్దర్‌, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్‌ తిరుమలరావు పేర్లు సిఫార్సు చేశాం. ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారు.. మనకు నాలుగైనా ఇవ్వలేదు. ఈ వివక్షపై కేంద్రానికి లేఖ రాస్తా. మందకృష్ణకు పద్మశ్రీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రొఫెసర్ల వయోపరిమితి 65కు పెంచే ఆలోచన ఉంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.