నిర్మించే ముందు అన్నీ సరిచూసుకునే బాధ్యత లేదా?
` వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు?
` నిర్మా సంస్థ ఆఫ్కాన్స్ ప్రతినిధులను ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్
హైదరాబాద్(జనంసాక్షి): ప్రాజెక్టుల పనులు ప్రారంభించేముందు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో సరిచూసుకోవాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలపై లేదా అని కాళేశ్వరం విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు.టెండర్ల వ్యవహారం అసమగ్రంగా ఉన్నప్పుడు వాటి గురించి ప్రభుత్వాన్ని అడగాలని.. ముందే జాగ్రత్తలు తీసుకొని ఉంటే నష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అన్నారం బ్యారేజీని నిర్మించిన ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులు నాగ మల్లికార్జునరావు, శేఖర్ దాస్ ..కాళేశ్వరం కమిషన్ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించింది. పనులకు సంబంధించిన ఒప్పందాలు, అందులోని అంశాలు, పనుల ప్రారంభం, ఆలస్యానికి గల కారణాలు, తలెత్తిన సమస్యలు, తీసుకున్న చర్యలు, తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు.బ్యారేజీ ప్రతిపాదిత లోకేషన్ మార్చడం, భూమి అప్పగింతలో ఆలస్యం జరగడంతోనే పనుల ప్రారంభానికి కొంత సమయం పట్టిందని ఆఫ్కాన్స్ ప్రతినిధులు వివరించారు. సైట్కు వెళ్లేందుకు మార్గం కూడా లేకపోవడంతో ఏడాది పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు అన్ని అంశాలను పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని.. కేవలం కాంట్రాక్టు, డబ్బులు వస్తున్నాయి కదా అని మాత్రమే చూసుకుంటే ఎలా అని కమిషన్ ప్రశ్నించింది. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీలో ఏడాదికే సమస్యలు ఎందుకు వచ్చాయని కమిషన్ ప్రశ్నించింది. ఈపీసీ ఒప్పందం అయి ఉంటే సర్వే సహా అన్ని అంశాలను తామే చూసుకునేవాళ్లమని ఆఫ్కాన్స్ ప్రతినిధులు చెప్పారు.ప్రొటెక్షన్ వర్క్స్ విషయమై నీటిపారుదలశాఖతో సంప్రదింపులు జరిపినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ తరహా ప్రొటెక్షన్ వర్క్స్ గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. సీసీ బ్లాకులు దెబ్బతిన్న తర్వాత కన్సల్టెన్సీతో అధ్యయనం చేయించామని.. ఆ సిఫార్సులపై నీటిపారుదల శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. అన్నారం ఆనకట్టకు ఎలాంటి పగుళ్లు రాలేదని, ఒకసారి సీపేజీ సమస్య వస్తే వెంటనే గ్రౌటింగ్ చేసి అరికట్టినట్లు ఆఫ్కాన్స్ ప్రతినిధులు కమిషన్ ముందు తెలిపారు.