గాంధీ సాక్షిగా పార్లమెంట్‌ ఎదుట

టీ ఎంపీల దీక్ష
మంత్రులు కలిసి రావాలని పొన్నం పిలుపు
కరీంనగర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి మంగళవారం వరకు ఢిల్లీలోని పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నట్లు కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం నగరంలోని రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ మంత్రులు,  డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి తమ ఆందోళనకు సంఘీభావం తెలిపి ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ హైకమాండ్‌ గుర్తించేలా ఒత్తిడి పెంచాలని కోరారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిందని, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకునేలా చూడాల్సిన బాధ్యత మనపై వుందని అన్నారు. ప్రజాస్వామిక ఉద్యమాలను అదే కోణంలో చూడకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినవారమవుతామని, గాంధీజీ ఆశయాలను కూడా దెబ్బ తీసిన   వారమవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. మే నెలలో తెలంగాణ ప్రకటన వస్తుందని పంచాయతీరాజ్‌ మంత్రి జానారెడ్డి అన్నారని అందుకే తెలంగాణలోని ప్రజలు ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచాల్సిన అవసరం వుందని అన్నారు. ఈ బడ్జెట్‌ సెషన్‌ మే 10న ముగుస్తుందని ఇంతలోనే ఏదైనా చేయాలని అన్నారు. మేనెల కీలకమైందని ఉద్యమంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే కీలక సమయంలో తాము గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్షలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ సోనియా నిర్ణయం అమలుకు చొరవతీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి వుంటానని అనడం హర్షణీయమని చెప్పారు. జేఏసీ సంసద్‌యాత్రకు తమను ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా తెలంగాణ ఏర్పాటు అంశంలో తమ బాధ్యత వుంటుందని చెప్పారు. జేఏసీ బయట ఉద్యమాలు చేస్తే తాము పార్లమెంట్‌ లోపల ఉద్యమాలు చేసి వేడి పుట్టిస్తామన్నారు. సంసద్‌యాత్రకు ఎంపీల సంఘీభావం వుంటుందా అనే ప్రశ్నలకు ఎంపీ స్పందిస్తూ పార్లమెంట్‌లో వేడిపుట్టిస్తామని, అలాగే పిలవని పేరంటానికి వెళ్లబోమని స్పష్టం చేశారు. పేరంటానికి పిలువక పోయినా అదికూడా తెలంగాణ కోసమే కాబట్టి తమ వంతు బాధ్యత నెరవెరుస్తామని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద ఐదుగురు టీ ఎంపీలు మాత్రమే నిరసన దీక్ష చేసే అవకాశం వుందని, మధుయాష్కీ బంధువు మృతి చెందడంతో ఆయన రావడం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజి మంజూరు చేయడం, రేకుర్తి- తీగలగుట్టపల్లి, తీగలగుట్టపల్లి-దుర్శేడు, సిరిసిల్లలలో రగుడు-పెద్దురూ రింగ్‌రోడ్డుకు సిరిసిల్ల పాలిటెక్నిక్‌ను జేఎన్‌టీయూ విద్యాలయంగా స్థాయి పెంచేందుకు ముఖ్యమంత్రి సుముఖుత వ్యక్తం చేశారని చెప్పారు. ప్రాణహిత జలాలను జిల్లాలోని గ్రామాల దాహార్తీ తీర్చేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయడం హర్షణీయమని అన్నారు. విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రావు, డి.శంకర్‌, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కన్న కృష్ణ, నిహాల్‌ మెసిన్‌, గందె మహేశ్‌, ఉప్పుల అంజనీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.