గాలి వార్తలు నమ్మొద్దు..పోరు బాట వీడొద్దు
అధికారిక ప్రకటన వచ్చేవరకు నిర్విరామ పోరాటం
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (జనంసాక్షి) :
గాలి వార్తలు నమ్మకుండా, ఈ నెల 30న తమ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌కు తరలిరావాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. ఢిల్లీలో తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ మార్చ్‌ను అడ్డుకునేందుకే అందరూ కలిసి నానా కుట్రలు చేస్తున్నారని, అఖిలపక్షం అంటూ, చర్చలు అంటూ మళ్లీ కాలయాపన చేసేందుకు కుతంత్రాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి తక్షణం తెలంగాణ ఏర్పాటుపై కచ్చితమైన ప్రకటన చేయాలని, లేకపోతే తెలంగాణ మార్చ్‌ను ఆపే ప్రసక్తే లేదని కోదండరాం స్పష్టం చేశారు. వెనక్కి తీసుకున్న డిసెంబర్ 9 ప్రకటనను మళ్లీ పునర్ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్‌తో భేటీ అయిన తరువాత కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కులను రక్షించడంలో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ మార్చ్ నిర్వహణకు సహకరించాలని వివరించారు. ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చామని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు ఉద్యమం నిరంతరాయంగా సాగుతూనే ఉందనికోదండరాం తెలిపారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మబలిదానాలు చేసుకోగా, వారందరూ తమ మరణ వాంగ్మూలాల్లో కేంద్రం ఇచ్చిన మాటకు కట్టుబడ లేదని, అందుకే మనస్తాపంతో తాము ప్రాణాలు విడిస్తున్నట్లు తెలిపారని, ఈ విషయాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర ప్రజలెవరూ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా లేరని, గుప్పెడు స్వార్థపరులు విభజనకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ ఢిల్లీలో ఇప్పుడు పరిణామాలు నిజమే అయితే, ఇవి రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడితే సంతోషిస్తామని కోదండరాం తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటేందుకు తాము మార్చ్‌ను నిర్వహించాలనుకుంటే, ఈ సత్కార్యాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రభుత్వం శాంతిభద్రతలు, మత ఘర్షణలు అంటూ బూచిని చూపి, ప్రజలను గందరగోళంలో పడేయాలని చూస్తోందన్నారు. శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహించబడే తెలంగాణ మార్చ్‌ను దుష్ట శక్తులు అల్లోకల్లోలం సృష్టించకుండా, తోడ్పాటునివ్వాలని గవర్నర్‌కు తెలిపినట్లు కోదండరాం వెల్లడించారు. తెలంగాణపై అఖిల పక్షం అంటూ వస్తున్న ఊహాగానాలపై కాకుండా, సాధికారికంగా వెలువడే సమాచారం పైనే స్పందిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కోదండరాంతోపాటు న్యూ డెమోక్రసీ పార్టీ నేత కె.గోవర్ధన్, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, కె.స్వామిగౌడ్, అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, కత్తి వెంకటస్వామి, రఘు, డాక్టర్ నర్సయ్య, మమత, రేచల్, రాజేందర్‌రెడ్డి, హమీద్, మహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు.