గిరిజనులు స్వయం సమృద్ది సాధించాలి: గవర్నర్
శ్రీకాకుళం,జూలై10(జనం సాక్షి ): శ్రీకాకుళం పర్యటనలో ఉన్న గవర్నర్ నరసింహన్ పెదరామలో స్వయం సహాయక సంఘాల మహిళలు, గిరిజనులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గన్నారు. ఆయన మాట్లాడుతూ…స్వయం సహాయక సంఘాలు గ్రూపుగా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అనేకం ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జన్‌ధన్ యోజన ఖాతాలు వలన రుణాలు పొందవచ్చన్నారు. పిల్లలను చదివించాలని, పాఠశాలలు, వైద్య సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. జిల్లా అధికారుల సమన్వయంతో పనిచేస్తున్న జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయ సహకారంతో గ్రూప్ కార్యకలాపాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్ కె.ధనంజయ రెడ్డి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్, విశ్వవిద్యాలయ ఉప కులపతి కూన రాంజి, రిజిస్టార్ర్ పి.రఘు, శాసనసభ్యులు విశ్వసరాయి కళావతి,
సంబంధిత అధికారులు పాల్గన్నారు. ఇదిలావుంటే ఉదయం గవర్నర్ నరసింహన్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా రెండోరోజు పర్యటన సందర్భంగా అరసవల్లిని గవర్నర్ నరసింహన్ సందర్శించారు. పార్లమెంటు సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.