గిరిపుత్రులకూ తప్పని ఫీజుల దోపిడీ

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని నంగార భేరి నాయకులు కోరుతున్నారు. ఈ జిల్లాలో పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువని, అధిక ఫీజులు చెల్లించే స్థోమత తల్లిదండ్రలుకు లేదన్నారు. అందువల్ల అధిక ఫీజుల పేరుతో దోపిడీ చేస్తున్న వారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీని కలిసి వినతిపత్రం అందించారు. ఏజన్సీ చట్టాలను, విద్యా శాఖ చట్టాలను గౌరవించకుండా పాఠశాలలు,కళాశాలలను ఏర్పాటు చేసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి కూడా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లోనే పుస్తకాలు, దస్తులు విక్రయిస్తూ అక్కడే కొనాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇలాంటి విద్యా సంస్థలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.కార్పొరేట్‌ కళాశాలకు దీటుగా ప్రభుత్వం కేజీ టు పీజీ విద్యను అందించాలని కోరారు. ఇదిలావుంటే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను రెన్యూవల్‌ చేయాలని కోరుతూ ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ రాజీవ్‌గాంధీని కలిసి వినతిపత్రం అందించారు. పదేళ్ల నుంచి ఐటీడీఏ భద్రాచలం పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలల పరిధిలో పనిచేస్తున్నామని, పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.