గుంటూరులో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం
– సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును అరెస్టు చేసిన పోలీసులు
గుంటూరు, జులై12(జనం సాక్షి) : నగరంలో గురువారం ఉదయం సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో అమాయకులను అరెస్టు చేశారంటూ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారిని పరామర్శించేందుకు ఆయన గురువారం పోలీసు స్టేషన్ వచ్చారు. అయితే, ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయినా మధు వెనుకకు తగ్గకపోవడంతో ఆయనను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో సీపీఎం శ్రేణులు పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొందరు యువకులపై పోలీసులు చేయి? చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు స్పృహ తప్పగా అతనిని ఆస్పత్రికి తరలించారు. అరెస్టు చేసిన వామపక్ష నాయకులు, కార్యకర్తలను నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నందున మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసు అధికారులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటూ వామపక్ష నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు.