గుజరాత్‌లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం
అ 68 శాతం పోలింగ్
అహ్మదాబాద్, డిసెంబర్ 13 (జనంసాక్షి) :
గుజరాత్‌లో తొలిదశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఉదయం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులుదీరారు. పోలింగ్ కొన్నిచోట్ల చురుకుగా.. మరికొన్నిచోట్ల మందకొడిగా ప్రారంభమైంది. కేశుభాయ్ పటేల్, అసెంబ్లీ స్పీకర్ గనపత్ వాసవ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 15 జిల్లాల్లో 87నియోజకవర్గాల్లో గురువారంనాడు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలివిడతలో కేశుభాయ్ పటేల్, అసెంబ్లీ స్పీకర్ గనపత్ వాసవ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.సి.ఫాల్డు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ మోద్‌వాదియా, ప్రతిపక్ష నేత శక్తిసిన్హ్, పలువురు మంత్రులు తొలివిడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకో నున్నారు. సౌరాష్ట్రలోని 52 స్థానాల్లోను, దక్షిణ గుజరాత్‌లో 29 స్థానాల్లోను పోలింగ్ ప్రారంభమైంది. అలాగే పశ్చిమ అహ్మదాబాద్‌లోని నాలుగు తహసిల్స్ ప్రాంతాల్లోను పోలింగ్ కొనసాగుతోంది. తొలివిడతలో 846 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.వారిలో 46మంది మహిళలు. భారతీయ జనతాపార్టీ 87 నియోజకవర్గాల్లోను అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ పార్టీ 84 స్థానాల్లోనే అభ్యర్థులను నిలిపింది. కేశూభాయ్ పటేల్‌కు చెందిన గుజరాత్ పరివర్తన్ పార్టీ 83 సీట్లలో తన అభ్యర్థులను బరిలోకి దించింది. బిఎస్‌పి 79, స్వతంత్రులు 383, ఇతరులు 130 మంది తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
మణినగర్‌పైనే..
అందరి దృష్టి మణినగర్‌పైనే ఉంది. మణినగర్‌లో మోడి విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ నేతృత్వంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ మణినగర్‌లో తన అభ్యర్థితో చివరి నిమిషంలో నామినేషన్‌ను ఉపసంహరింపజేసింది. దీంతో మోడీ, కాంగ్రెస్ అభ్యర్థి శ్వేతాభట్ మధ్యే ప్రధాన పోటీ జరగనున్నది. మోడీకి మద్దతుగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా 2002 ఎన్నికల్లో నరేంద్ర మోడి 75,333 ఓట్లతోను, 2007 ఎన్నికల్లో 87,161 ఓట్లతోను విజయభేరి మోగించారు. ఈసారి ఎన్నికల్లో లక్ష ఓట్లు సాధించడం ఖాయమని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. మలి విడత ఎన్నిక ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 182 నియోజకవర్గాలు కాగా.. తొలి విడతలో 87 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతున్న విషయం విదితమే. ఈ నెల 17న మిగిలిన 95 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనున్నది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఈ నెల 20వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.