గూడెం గుండెల్లో వారు పదిలం
ఆదిలాబాద్,జనవరి10(జనంసాక్షి):మన ఊరు కాదు, దేశం కాదు. మన భాష కూడా తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే. ఆదివాసీలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి దరికి చేర్చడం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి.. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు ఆరాధ్య దైవాలుగా మారారు. అలా ఆదివాసుల గుండెల్లో గూడు కట్టుకున్నారు ఇంగ్లాండ్ కు చెందిన ప్రొఫెసర్ హెమండార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతులు. ఇవాళ హెమండార్ఫ్ వర్ధంతి. లండన్ కు చెందిన హేమండార్ఫ్ దంపతులు 1930లో మానవ పరిణామక్రమంపై పరిశోధన చేస్తూ మన దేశానికి వచ్చారు. వివిధ రాష్ట్రాలలో పర్యటించి గిరిజనుల స్థితిగతులపైన అధ్యయనం చేశారు. అదే సమయంలో ఇక్కడి నిజాం ప్రభుత్వం గిరిజనులకు మేలు చేయాలని సంకల్పించింది. బ్రిటిష్ సర్కారు సహకారంతో ఇక్కడి గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసేందుకు హేమండార్ఫ్ దంపతులు ఆదిలాబాద్ కు వచ్చారు. భూమిపై హక్కుకోసం కొమరం భీం పోరాటం చేశాడని తెలుసుకున్న హేమండార్ఫ్, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించారు. విద్యా, వైద్య రంగాలలో గిరిజనులు అభివృద్ధి చెందాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదించారు. గిరిజన గ్రామంలో పెద్దలతో చర్చించి, ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్, గిన్నెదరి ప్రాంతాల్లో స్వచ్ఛంద పాఠశాలలను ఏర్పాటు చేశారు. మార్లవాయి గిరిజన గ్రామంలోనే హేమండార్ఫ్ దంపతులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. గిరిజనులతో మమేకమై వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం జీవితాన్ని గడిపారు. గిరిజనులపై చేసిన అధ్యయనంలో హేమండార్ఫ్ కు ఆయన భార్య ఎలిజబెత్ చేదోడు వాదోడుగా నిలిచారు. ఆమె కూడా స్థానికంగానే ఉంటూ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేశారు. 1986లో హైదరాబాద్ లో జరిగిన జాతీయ గిరిజన సదస్సులో ప్రసంగిస్తుండగా ఎలిజబెత్ హఠాన్మరణం చెందారు. ఆమె కోరిక మేరకు మార్లవాయి గ్రామంలో గిరిజన సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మార్లవాయి గ్రామంలో ఎలిజబెత్ వర్ధంతికి హేమండార్ఫ్ గిరిజనులతో కలిసి హాజరయ్యేవారు. తన మరణానంతరం భార్య సమాధి పక్కనే తన సమాధి కట్టించాలని కోరారు హెమండార్ఫ్. గిరిజనులతో మమేకం అయిన తన కొడుకు నికోలస్ కు లచ్చు పటేల్ అని పేరు పెట్టారు. ఐటిడిఎ ఏర్పడిన తరువాత అప్పటి అధికారులతో పలు సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయించారు. ఆ తర్వాత లండన్ కు తిరిగి వెళ్లిన హెమండార్ఫ్.. 1995 లో మృతి చెందారు. తరువాత మార్లవాయిలో నిర్మించిన సమాధిలో అస్థికలను ఉంచేందుకు హెమండార్ఫ్ కుమారుడు నికోలస్ ఇండియాకు వచ్చారు. తమ బాగు కోసం కృషి చేసిన హెమండార్ఫ్ దంపతులను గిరిజనులు గుండెల్లో పెట్టి కొలుచుకుంటున్నారు. ప్రతియేటా వర్ధంతిని నిర్వహిస్తున్నారు.