గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం

ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసే పనిలో అధికారులు

నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్న సర్కార్‌ రైతు వ్యవసాయం చేయాలంటే వాతావరణం అనుకూలంగా ఉన్న సాగునీటిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే జిల్లాలో ఏఎమ్మార్పీ , మూసీ, ఎన్‌ఎస్పీ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపును చేసి ఇప్పటికే సాగునీటిని దృష్టిలో పెట్టుకుని మరమ్మతులు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన నీటి వనరులైన ఈ ప్రాజెక్టుల కింద 552 నీటిపారుదల శాఖకు సంబంధించిన చెరువులు ఉండగా వాటి పరిస్థితి ఏంటనే కోణంలో ఐబీ యంత్రాంగం వివరాలు తీస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన నీటి వనరులైన ఈ ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల జరగాల్సిన నేపథ్యం లో వాటి కింద ఉన్న గొలుసుకట్టు చెరువుల జాబితాను సేకరిస్తున్నారు. ఆయా చెరువులకు అవసరమైతే నిధులు వెచ్చించి, పునరుద్‌ధ్దరించి ప్రగతిలోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కార్‌ ఆదేశాల మేరకు ఐబీ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగంతో సవిూక్ష నిర్వహించి చెరువుల వివరాల సేకరణపై నివేదించమని సూచించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రతి చెరువుకు నీటి విడుదల జరిగేందుకు అడ్డంకులున్నట్లయితే వాటిని క్లియర్‌ చేసి ప్రతి సీజన్‌లో సాగునీటిని ఇచ్చే సమయంలో చెరువులను సైతం నింపనుంది. ఈచెరువుల ప్రస్తుత పరిస్థితి ఏంటనేది ఐబీ యంత్రాంగం వద్ద ఉన్నప్పటికి ఆయా చెరువులను మరోసారి పూర్తి స్థాయిలో చూసి ఎలాంటి ఆటంకం లేకుండా నీరు వెళుతుందా లేదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రధానం గా ఒక చెరువుకు మరో చెరువుకు మధ్యలో ఫీడర్‌చానెల్‌ లేదంటే కాల్వలు ఉండగా వాటిల్లో చెత్త పేరుకుపోవడం, కంపచెట్లు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో అవి అన్యాక్రాంతం కావడం జరిగింది. రెండేళ్లుగా ఆయా ప్రాజెక్టుల ద్వారా చెరువులకు నీటి విడుదల చేస్తున్నప్పటికి పూ ర్తి స్థాయిలో గొలుసు కట్టు చెరువులకు వెళ్లని పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఉన్న గొలుసుకట్టు చెరువులు గుర్తించి వాటి పరిస్థితిని అంచనా వేసి నివేదించాలని సర్కార్‌ ఆదేశించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ప్రధాన నీటి వనరుగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుతో పాటు దీనిలో అంతర్భాగమైన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు నీటి విడుదల జరుగుతుంది. ఇక యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు నీటి వనరైన మూసీప్రాజెక్టు కింద సైతం పలు గొలుసుకట్టు చెరువులుఉన్నాయి.

జిల్లా వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టిన

ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టుల ద్వారా గొలుసు కట్టు చెరువులను నింపాలని యోచిస్తుంది. ప్రతి సంవత్సరం వానాకాలం సీజన్‌లో ఉ మ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఆయకట్టుకు నాగార్జునసాగర్‌, ఎలిమినేటి మాధవరెడ్డి (ఏఎమ్మార్పీ)ప్రాజెక్టులతో పాటు మూసీ ద్వారా సాగునీరు విడుదల చే స్తున్నారు. ఈక్రమంలో సాగు భూములకు నీరందుతున్నప్పటికి మిగిలిన మేరకు చెరువుల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వృథా జరుగుతుంది. ఈ నీటి వృథాను అరికట్టి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న గొలుసుకట్టు చెరువులను నింపితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగుకు ఉపయోగపడతాయని యోచించింది.