గోడ దూకేందుకు టీ ఎంపీలు సిద్ధం

టీఆర్‌ఎస్‌ తలుపు తట్టిన జగన్నాథం
‘మంద’ చాలా ఉంది : కేసీఆర్‌
ఎంపీగానే కలిశా.. పార్టీలోకి రమ్మన్నారు : మందా
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) :
గోడ దూకేందుకు టీ కాంగ్రెస్‌ ఎంపీలు సిద్ధమవుతున్నారు. ఆదివారం రాష్ట్ర రాజధానిలో ఈమేరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నాగర్‌కర్నూర్‌ ఎంపీ మందా జగన్నాథం టీఆర్‌ఎస్‌ తలుపు తట్టాడు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయ నకు సాధరంగా స్వాగతం పలికారు. సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు కె. కేశవరావు కూడా ఈ సందర్భంగా కేసీఆర్‌తో  భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో తమకు రాజకీయ భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చిన ఐదుగురు ఎంపీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసు కున్నట్టు సమాచారం. ఆయన రెండు, మూడు రోజుల్లో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 27న తెలంగాణ రాష్ట్ర సమితి 13వ వార్షికోత్సవ ప్రతినిధుల  సదస్సును నిజామా బాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వ హిస్తున్నారు. కాంగ్రెస్‌      ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు అప్పటిలోగా పార్టీలో చేరితేనే వారి భవిష్యత్తుపై హామీ ఇవ్వగలనని కేసీఆర్‌ తేల్చిచెప్పినట్టు సమాచారం. మే 15లోపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తానని, తాను ఇప్పటికే ఆ తేదీని ప్రకటించినందునా ఆలోపు పార్టీలోకి వస్తేనే టికెట్‌ ఇవ్వగలమని, తీరా అభ్యర్థుల పేర్లు ప్రకటించాక పార్టీలో చేరినా ఉపయోగం ఉండదని చెప్పినట్టు సమాచారం. దీంతో మందా జగన్నాథం తాను రెండు, మూడు రోజుల్లో పార్టీలో చేరడంతో పాటు, ఈ నెల 27న జరిగే టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవ సభకు వరంగల్‌ ఎంపీ రాజయ్య, పెద్దపల్లి ఎంపీ వివేక్‌, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను పార్టీలోకి తీసుకువస్తానని మందా కేసీఆర్‌కు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే తెలంగాణ ఎంపీల్లో బలరాంనాయక్‌, జైపాల్‌రెడ్డి మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. మధుయాష్కీ మొదట తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇస్తానంటూ బహిరంగ ప్రకటనలు చేసినా అనంతరం ఆయన వెనక్కి తగ్గారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకుంటానని స్పష్టం చేశారు. జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌షెట్కార్‌ మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసిపోలేదు. దీంతో మందాతో పాటు రాజయ్య, సుఖేందర్‌రెడ్డి, వివేక్‌లు రావడం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీలో చేరాలా? టీఆర్‌ఎస్‌లోకి వెళ్లాలా? అనే విషయాన్ని ఇంకా తేల్చుకోనట్టు తెలిసింది. ఏది ఏమైనా టీ కాంగ్రెస్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక ఎంపీగానే కలిశా : మందా
టీఆర్‌ఎస్‌లో చేరాలని కేసీఆర్‌ తనను ఆహ్వానించారని ఎంపీ మందా జగన్నాధం అన్నారు. ఆదివారం రాజ్యసభ మాజీ సభ్యుడు కె.కేశవరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావును ఒక ఎంపీగానే కలిశానని, ఆయన తన పార్టీలోకి  ఆహ్వానించారన్నారు. అయితే తమ తోటి ఎంపీలతో కూడా సంప్రదించాల్సి ఉందని, ఆ తర్వాతే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని స్పష్టం చేశాననన్నారు. రేపో, ఎల్లుండో తోటి ఎంపీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఆ తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత తాను ఒక నిర్ణయాన్ని తీసుకుంటానని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో మంత్రి డికె అరుణ తనకంటే జూనియర్‌ అని అన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తాను పార్టీని వీడాలంటే ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రకటించకుంటే ఆ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో ఆ  పార్టీ పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా మంత్రి జానారెడ్డితో కె.కేశవరావు భేటీ అయ్యారు.