గోదావరి ఉగ్రరూపం

4లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
ఏలూరు, జూలై 27 : మొన్నటి వరకు పడిపోయిన నీటి సామర్థ్యం నిల్వలతో కాళావీహీనంగా మారిన గోదావరి నదికి ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఉగ్ర గోదావరిగా మారింది. చిన్న సెలయేరులా కనిపించి, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను క్షోభకు గురిచేసిన గోదావరికి వరద పోటెత్తింది. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌ వంటి రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉపనదులు పొంగి పోర్లుతున్నాయి. సీలేరు ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి ఉపనదులైన శబరి, ప్రాణహిత నదులనుంచి గత మూడు రోజులుగా సగటున 5లక్షల క్యూసెక్కులకు పైన వరద నీరు వచ్చి చేరింది. దవళేశ్వరం కాటన్‌బ్యారేజి వద్ద గోదావరి మహోద్ధృతంగా ప్రవహిస్తోంది.
దవళేశ్వరం బ్యారేజి వద్ద 175గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. శుక్రవారం నాడు 4లక్షల 25వేల క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి అధికారులు వదిలిపెట్టారు. గురువారం నాడు నాలుగు లక్షల యాభైవేల క్యూసెక్కుల వరదనీటిని సముద్రంలోకి వదిలిన అధికారులు శుక్రవారం నాటికి ఇన్‌ఫ్లో తగ్గిపోవడంతో సముద్రంలోకి వదిలే నీటిని 25వేల క్యూసెక్కులకు తగ్గించారు. అఖండ గోదావరి సామర్థ్యం 20లక్షల క్యూసెక్కులు. 10లక్షల క్యూసెక్కుల నీటి మట్టం పెరిగితే గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ప్రస్తుతానికి ఆ స్థాయిలో వరద నీరు చేరడం లేదు. అయినప్పటికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఉభయ గోదావరి జిల్లాల అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ఆయా జిల్లా కలెక్టర్లు వాణీ మోహన్‌, నీతూ ప్రసాద్‌ శుక్రవారం నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.