గోవా లోకాయుక్తగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
పనాజీ, మార్చి 13 (జనంసాక్షి):
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి గోవా లోకాయుక్తగా నియమితులయ్యారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం స్థానిక మీడియా ప్రతినిధులతో ఈ విషయం వెల్లడించారు. ఆయన నియమాకాన్ని కేబినెట్ ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. లోకాయుక్త బిల్-2013 అమల్లోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి లోకాయుక్త సుదర్శన్‌రెడ్డి కావడం గమనార్హం. ఆయన శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని పారికర్ వెల్లడించారు. రెండు, మూడు వారాల్లో ఆయన పని ప్రారంభిస్తారని తెలిపారు. లోకాయుక్తకు సొంతగా సిబ్బందిని నియమించుకొనే స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిని తన కార్యాలయ సిబ్బందిగా ఆయన నియమించుకోవచ్చు. డీఎస్పీ క్యాడర్ అధికారి ఎల్లవేళలా ఆయన వెన్నంటే ఉంటాడు. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలను నమోదు చేసి ఉంచామని, వాటిని లోకాయుక్త ఎదుట ఉంచుతామని పారికర్ చెప్పారు.