గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్, జూలై 19 : ఏపిపిఎస్ సి ద్వారా ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రూప్-2 ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు, 22న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు మూడు పేపర్లు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పరీక్ష నిర్వహణకు 52 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కరీంనగర్లో 30701 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారన్నారు. పరీక్ష నిర్వహణకు ఒక్కొక్క కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ చొప్పున 52 మందిని, 16 మంది లయసన్ అధికారులుగా, 52 మందిని డిప్యూటీ తహశీల్దార్లను సిట్టింగ్ స్వ్కాడ్గా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి పిబిఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.