గ్రూప్ వన్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి. జనార్దన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి బ్యూరో జనం సాక్షి
ఈనెల 16 న నిర్వహించబడే గూప్ 1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు.బుధవారం నాడు ఆయన రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్, సర్వీసు కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు, పరీక్షల ఛీప్ సూపరింటెండెంట్లతో ఈనెల 16 న ఆదివారం నాడు నిర్వహించబడే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లను జిల్లాల వారీగా సమీక్షిస్తూ, పరీక్ష నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుద్యం, అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఇన్చార్జీ కలెక్టరు దీపక్ తివారీ జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అధికారులతో పరీక్ష నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 13 పరీక్షా కేంద్రాల ద్వారా 3644 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయడం జరుగుతున్నట్లు తెలిపారు. దీనికోసం 4 లైజన్ ఆఫీసర్స్, 13 అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్స్, 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీములు, 13 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 204 మంది ఇన్విజిలేటర్లను నియమించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్షకు హాజరుగు అభ్యర్థులు పరీక్ష ప్రారంభమగుటకు ఒక గంట ముందుగానే హాల్ టిక్కెట్లతో పరీక్షా కేంద్రాల వద్ద వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, పరీక్షా కేంద్రానికి ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా సమయం ఉదయం 10.15 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలుకు అనుమతించడం జరగదని తెలిపారు. అభ్యర్థులు ఇట్టి విషయాన్ని గమనించాలని సూచించారు. అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందే తమ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అడ్రస్ తెలుసుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ హాజరు తీసుకోవడం జరుగుతుందని, పరీక్షా కేంద్రం లోనికి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్, బ్లూటూత్, గణిత పట్టికలు, వాచీలు అనుమతించబడవని, అభ్యర్థులు షూస్ ధరించి రావద్దని, చెప్పులు మాత్రమే ధరించి రావాలని తెలిపారు. హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోని వారు వెంటనే https://www.tspsc.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు హాజరగునప్పుడు హాల్ టిక్కెట్టుతో పాటు ప్రభుత్వంచే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మొదలైనవి తమ వెంట తీసుకొని రావాలని సూచించారు. హాల్ టిక్కెట్ పై ఫోటో కానీ, సంతకం కానీ ముద్రించబడనట్లయితే గజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించబడిన మూడు పాస్ పోర్టు ఫోటోలు, అండర్ టేకింగ్ ఇన్వెజిలేటర్ కు ఇవ్వాలని, పరీక్షలో బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలని, ఓఎంఆర్ సమాధాన పత్రంలో సర్కిల్స్ పూర్తిగా షేడ్ చేయాలని, ఒకసారి షేడ్ చేసిన పిదప వైట్నర్ పెన్, బ్లేడ్, చాక్‌పీస్ పౌడర్ ఉపయోగించరాదని తెలిపారు. పరీక్షా సమయం పూర్తి అయ్యే వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రం వదిలి వెళ్లుటకు అనుమతించబడదని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 9848026032 ఏర్పాటు చేయడం జరిగిందని బస్టాండ్, రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు ముందు రోజే పరీక్షా కేంద్రాలలో బెంచీలు, హాల్ టిక్కెట్ నెంబర్లు, కోడ్స్ పరిశీలించుకోవాలని, పరీక్షా కేంద్రాలలో తాగునీటి వసతి, అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా, అలాగే టాయిలెట్స్ సూచించే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు, పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు, జీరాక్సు షాప్‌లను మూసివేయడంపై తగిన చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు నారాయణరెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి నారాయణరెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్స్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరాచారి, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్స్, విద్య, వైద్య, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail
|