ఘనంగా అవతరణ వేడుకలు


ఖమ్మంలో సుందరీకరణ పనులు

స్పష్టమైన ఆదేశాలు అందచేసిన కలెక్టర్‌
ఖమ్మం,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణం తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం పట్టణంలో విద్యుత్‌ దీపాలకంకరణలు చేపట్టారు. వీధులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని ,పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ బ్రహ్మాండంగా జరగాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాలకనుగుణంగా జూన్‌ 2న జిల్లా, డివిజన్‌, మండల, పంచాయతీలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకుఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఖమ్మం నగరంలో జూన్‌ 2న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెవిలియన్‌ గ్రౌండ్‌ వద్దగల అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం బైపాస్‌ రోడ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల అలంకరణ చేస్తారని తదనంతరం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో జరిగే వేడుకల్లో మంత్రి పాల్గొంటారని కలెక్టర్‌ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జిల్లాలో 3రోజుల పాటు వేడుకలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు భక్తరామదాసు కళాక్షేత్రాన్ని సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే 2వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూడు రోజుల పాటు విద్యుత్‌దీపాలతో అలంకరించాలని కలెక్టర్‌ సూచించారు. అదేవిధంగా నగరంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్‌దీపాలతో అలంకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌కు కలెక్టర్‌ సూచించారు. సమాజ సేవా కార్యక్రమంలోభాగంగా వైద్యశాలల్లో రోగులకు పండ్లను పంపిణీ చేయాలని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పోలీసు పరేడ్‌ మైదానంలో జరిగే పోలీసు కవాతు, గౌరవ వందన స్వీకారం, మైదాన ఏర్పాట్లను ముందస్తుగానే చూసుకోవాలని పోలీసు అధికారులకు కలెక్టర్‌ సూచించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సత్కరించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని, పరేడ్‌ మైదానంలో ప్రోటోకాల్‌, వసతి, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కేంద్రం తదితర ఏర్పాట్లను చేయాలలని  కలెక్టర్‌ ఆదేశించారు. ప్రజలను అలరింపజేసే విధంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారిని సత్కరించుకునేందుకు గాను ఆయా కమిటీలు తగు చర్యలు తీసుకోవాలని కమిటీలకు నిర్దేశించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.