చండ్ర నిప్పుల్లా చలో అసెంబ్లీ

కార్యాచరణ దిశగా టీ జేఏసీ
‘బయ్యారం’కు బస్సు యాత్ర
ఉద్యమం ఉధృతం : కోదండరామ్‌
హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) :
చండ్ర నిప్పులల్లా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించామన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రజలు ఉధృతంగా పోరు కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి ఎంతమాత్రం పట్టడం లేదని, యూపీఏ సర్కారుకు ఆవహించిన నిర్లక్ష్యాన్ని వదలగొడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలోని బయ్యారం ఉక్కు ఈ ప్రాంతానికే చెందాలని డిమాండ్‌ చేస్తూ బస్సు యాత్ర నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా భీమదేవపరల్లి నుంచి ప్రారంభమయ్యే యాత్ర వరంగల్‌ జిల్లా గూడురు మీదుగా ఖమ్మం జిల్లాలోని బయ్యారానికి చేరుతుందని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరిపై పోలీసులు పెట్టిన ప్రతికేసును ఎత్తివేస్తామని దేశ ప్రధానమంత్రే స్వయంగా ప్రకటించినా నేటికి కూడా మోక్షం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసేది ఒకటి, చెప్పేది ఇంకోటి అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు ఎన్ని కేసులు ఎత్తివేశారు, ఇంకెన్ని ఉన్నాయనే దానిపై పోలీసుల్లోనే స్పష్టత లేదన్నారు. నిన్నటికినిన్న కరీంనగర్‌లో కేసులు ఎత్తివేస్తున్నామని జీఓ విడుదల చేసినా అందులో కూడా స్పష్టత లేదని కోదండరామ్‌ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఆవష్యకతను తెలియజెప్పే ఉద్యమ వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు. తెలంగాణ సాధన ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పారు. చలో అసెంబ్లీ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.