చంద్రబాబు రైతుల పక్షపాతి
ఖమ్మం, అక్టోబర్ 29: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. 2014లో టిడిపి అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించడం హర్షనీయమన్నారు. ఇది అన్నదాతల పట్ల చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను తెలియజేస్తుందన్నారు. 9గంటల విద్యుత్‌ను అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానిన్ని 7గంటలకు కుదించి, ఇప్పుడు 3గంటలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. జిల్లాలో 5.65లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగు చేశారని, అధిక ధరలు, ఎక్కువ పెట్టుబడులతో రైతుకు ఈ ఏడాది ఓరిగింది ఏమీ లేదన్నారు. అందుకే పత్తి క్వింటాలుకు ఆరువేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని సుధాకర్ డిమాండ్ చేశారు. రైతుకు పంట నష్ట పరిహారం కింద విడుదలైన 118 కోట్ల రూపాయలను వెంటనే పంపిణీ చేయాలన్నారు. సాగర్‌లో ప్రస్తుతం 537 అడుగుల నీటిమట్టం ఉందని, రబీకి పూర్తిగా నీరు ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.