చట్టబధ్దంగానే ఎంసెట్‌

c

సమస్య పరిష్కారానికి ఏపీ చొరవ చూపడం లేదు

మా పరీక్ష మేమే నిర్వహించుకుంటున్నాం – మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి

న్యూఢిల్లీ,జనవరి6(జనంసాక్షి): పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్‌ నిర్వహించే హక్కు తెలంగాణకే ఉందని, ఏపీ ప్రభుత్వం మాతో సంప్రదించకుండానే ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని దీంతో స్పష్టమయ్యిందని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ లేదా మెడికల్‌ సీటు కోరుకునే ఆంధ్ర విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్‌నే రాయాలని మంత్రి అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్లో జరుగుతున్న విద్యామంత్రుల సమావేశానికి హాజరైన ఆయన విూడియాతో మాట్లాడుతూ..  అవసరమైతే ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు తాము  సిద్ధంగా ఉన్నామన్నారు. తమ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని చెప్పారు. ఇదిలావుంటే మంత్రులు ఢిల్లీకి రావడంతో  తెలంగాణ, ఏపీ రాష్టాల్ర మధ్య నెలకొన్న ఎంసెట్‌, కృష్ణా జలాల వివాదం ఢిల్లీకి చేరుకుంది. మంగళవారం ఉదయం తెలంగాణ, ఏపీ విద్యాశాఖ మంత్రులు జగదీష్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో జరుగనున్న విద్యాశాఖ మంత్రుల సదస్సులో వీరు పాల్గొంటున్నారు. అదే విధంగా ఇరు రాష్టాల్ర మధ్య నెలకొన్న ఎంసెట్‌ వివాదాన్ని కేంద్రం ముందుకు తీసుకువచ్చే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో ఏపీ మంత్రి గంటా భేటీ అయి ఇరురాష్టాల్ర మధ్య నెలకొన్న వివాదాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర పెద్దల దృష్టి తీసుకొచ్చినప్పటికీ వివాదం కొలిక్కిరాని క్రమంలో కోర్టును ఆశ్రయించాలని వెంకయ్య సూచించినట్లు తెలుస్తోంది. ఈ వివాదాన్ని కేంద్రమంత్రి స్మృతీ ఇరానీతో సహా ఇతర మంత్రులతో చర్చించిన తరువాత కూడా రెండు రాష్టాల్ర మధ్య సయోధ్య కుదరని పక్షంలో కోర్టు  వెళ్లడమే తప్ప మరో మార్గం లేదని మంత్రి గంటా చెప్పారు. మరోవైపు తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి తమ వాదనకే కట్టుబడి ఉన్నారు. తెలంగాణకు విడిగా పరీక్ష నిర్వహిస్తామని, అవసరమైతే ఆంధ్రాకు కూడా సంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇరు రాష్టాల్ర మధ్య నెలకొన్న మరో వివాదం కృష్ణాజలాలు పంచాయతీ కూడా ఢిల్లీకి చేరుకుంది. సాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్నటువంటి రబీకి నీటి విడుదల అంశం నదీ యాజమాన్యం బోర్డు స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో కేంద్ర మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకువచ్చేందుకు టి.ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.  ఉదయం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, సలహాదారు విద్యాసాగర్‌రావు ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్రమంత్రితో భేటీ అయి ఈ అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సాగర్‌ ఎడమ కాల్వ నుంచి రబీకి నీటి విడుదలపై జోక్యం చేసుకోవాల్సిందిగా ఉమాభారతిని కోరే అవకాశం ఉంది. వివాదాల పరిష్కారం కోసం అటు విద్యాశాఖ, ఇటు తాగునీటి శాఖకు సంబంధించిన అధికారులు, మంత్రులు ఢిల్లీకి చేరుకున్నారు.