చట్టవ్యతిరేకమైతే బాక్సైట్‌ రద్దు చేస్తాం

రాజీవ్‌ బాల సంజీవిని ప్రారంభించిన సీఎం
విశాఖపట్నం, మార్చి 17 (జనంసాక్షి) :
బక్సైట్‌ తవ్వకాలు రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకంగా సాగడం లేదని, అలా సాగడం లేదని బాక్సైట్‌ లీజులు రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని గూడెం కొత్తవీధిలో ‘రాజీవ్‌ బాల సంజీవని’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాక్సైట్‌ లీజులు నిబంధనల మేరకు ఇచ్చారని, ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలితే వాటిని పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గిరిజనులకు వైద్యం అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 15 రోజుల కోసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వాటి కనుగుణంగా చికిత్స అందిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. అటవీ ఉత్పత్తులపై సర్వహక్కులు కల్పిస్తామన్నారు. గిరిజన గర్భిణుల కోసం ‘ఇందిరమ్మ అమృత హస్తం’ ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. మన్యంలో 2014లోపు 962 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని పూర్తి   చేస్తామని అన్నారు. పీఎంజీఎస్‌వై పథకం కింద రూ.528 కోట్లతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్‌ కార్యకర్తలు విస్తృతస్థాయిలో ప్రచారం కల్పించాలని కోరారు. రాజీవ్‌ బాల సంజీవని ద్వారా 3,50,000మంది గిరిజన బాలలకు జీపుల ద్వారా వైద్య సహాయం అందించనున్నట్టు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా జికెవీధిలోను, చింతపల్లిలోను ముఖ్యమంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లోను పాలుపంచుకున్నారు. కేంద్ర మంత్రులు కిశోర్‌ చంద్రదేవ్‌, జైరాం రమేష్‌, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, గంటా శ్రీనివాసరావు, కె.జానారెడ్డి, ఎమ్మెల్యే బాలరాజు తదితరులు పాల్గొన్నారు. చింతపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేకంగా 78 అంబులెన్సులను మంజూరు చేశామన్నారు. చింతపల్లి మండలం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అందులో భాగంగానే ఆదివారంనాడు చింతపల్లిలో 133 కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశామన్నారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం 28 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామన్నారు. చింతపల్లి  ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేయనున్నామని తెలిపారు. భవన నిర్మాణం కోసం 7కోట్ల 80లక్షల రూపాయలు కేటాయించామన్నారు. కంటి, పంటి పరీక్షలు, ఎక్స్‌రే, ఇసిజి పరీక్షలను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేయనున్నామన్నారు. చింతపల్లి తొమ్మిది మండలాల్లోని 9,500మంది జనాభా ఉన్న గ్రామాల్లో సోలార్‌ ద్వారా విద్యుత్‌ అందజేయనున్నట్టు తెలిపారు. అందుకు గాను 16 కోట్ల 60 లక్షల రూపాయలు కేటాయించామన్నారు.అందుకు సంబంధించిన శంకుస్థాపన పనులు కూడా నేడు పూర్తయ్యాయన్నారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో 274 గ్రామాలకు అంటే 30వేల జనాభా ఉన్న ప్రాంతాలలో 50 కోట్ల రూపాయలతో సోలార్‌ ద్వారా విద్యుత్‌ అందించనున్నట్టు తెలిపారు. ఆ పనులను కూడా నేడు ప్రారంభించామన్నారు. ట్రైబల్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థులు గతేడాది 99 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఇప్పుడు భవన నిర్మాణానికి 3కోట్ల 80లక్షల రూపాయలు మంజూరు చేశామని, ఈ ఏడాది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. నూతనంగా ఐటిఐ, పాలిటెక్నిక్‌ కళాశాలలు కావాలని ఎమ్మెల్యే బాలరాజు, తదితరులు అడిగారన్నారు. వారి విజ్ఞప్తి మేరకు ఆరు పాలిటెక్నిక్‌ కళాశాలలను మంజూరు చేస్తున్నామన్నారు. అంతేగాక ఒక్కొక్క కళాశాల ఏర్పాటుకు గాను 6 కోట్ల 50 లక్షల రూపాయలను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు. సీతంపేట, గుమ్మలక్ష్మిపురం, చింతపల్లి, రంపచోడవరం, మేడారం, ఉట్నూరులలో పాలిటెక్నిక్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ ప్లాన్‌ చట్ట రూపం దాల్చడంతో ఈ ఏడాది బడ్జెట్‌లో 3వేల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు వెల్లడించారు. అలాగే ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ, బీసీ, ఓసి విద్యార్ధుల మెస్‌ చార్జీలను 72శాతం మేర పెంచిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అన్ని ఐటిడిఎల్లోనూ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పదో తరగతి తర్వాత చదువు ఆపివేసిన వారికి ఆయా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. మొత్తం 11 శిక్షణ కేంద్రాలు మంజూరు చేశామన్నారు. వాటిల్లో చింతపల్లికి ఒకటి కేటాయిస్తున్నామన్నారు. అయితే ఆయా శిక్షణకేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలకు 4వేల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, వాటిని త్వరలోనే భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ, ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ నిర్ణయం ఇప్పటికే ప్రకటించామని, గిరిజనులు భయపడవద్దని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని ప్రధాన మంత్రి సమక్షంలోనే నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. మరో కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ మాట్లాడుతూ, మైనింగ్‌ ఉన్న చోటనే మావోయిస్టులు ఉన్నారని అన్నారు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల గిరిజనులకు నష్టం కలుగుతుందని అన్నారు. తవ్వకాలపై 20 ఏళ్లపాటు మారిటోరియం విధించాలని కోరారు. ఈ సందర్భంగా వెదురు వనాలపై గిరిజనులకు హక్కులు కల్పిస్తూ పత్రాలు అందజేశారు.