చదువుతోనే జీవితాలు బాగుపడతాయి

— మూడేళ్ల తర్వాత విద్యా ప్రమాణాలు మారుతాయి  — మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణకు ఎవరు సాటిరారు
— ఉత్తమ ప్రధానోపాధ్యాయులను సన్మాన సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ .
మహబూబ్ నగర్ ,జూలై 20, ( జనంసాక్షి ) :
చదువుతోనే జీవితాలు బాగుపడతాయని మహనీయుడు అంబేడ్కర్ చెప్పిన ప్రకారం ప్రభుత్వ విద్యా వ్యవస్థను సీఎం కేసీఆర్ దశల వారీగా మెరుగుపరుస్తున్నారని ఎక్సైజ్,  పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బడులను బాగు చేసేందుకు తమ సర్కారు ఎంతో చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఆయన అన్నారు.
స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22 జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారై ఆరు అంశాల్లో మెరుగైన ప్రమాణాలు కలిగిన 30 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ అవార్డులను అందించారు.మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు దేశంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్న జిల్లా కాగా నేడు అన్ని రంగాలతో పాటు విద్యారంగంలో సైతం ఊహించని ప్రగతి సాధించిందని తెలిపారు.పాఠశాలల అభివృద్ధి కోసం నిధుల కేటాయింపు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు -మనబడి ద్వారా రూ.7400 కోట్లు ఖర్చు చేసి దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారని, సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని అంశాలలో పోటీ పడుతున్నాయని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు వెళ్తున్నాయని, మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని విద్యావ్యవస్థను, విద్యా ప్రమాణాలలో ఏ రాష్ట్రం కూడా పోటీ పడలేదని మంత్రి తెలిపారు.ఆరు అంశాల్లో మెరుగైన ప్రమాణాలు కలిగిన 30 పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ దక్కడం సంతోషకరమని.. రాష్ట్ర,  జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చూపాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉత్తమ ప్రతిభను కనబర్చిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాక్రమంలొ జడ్చర్ల ఎమ్మెల్యే డా సి. లక్ష్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.