చరిత్రగప్పిన తెలంగాణ తొలి హీరో పైడిజయరాజ్‌

1

తెలంగాణలో పుట్టడమే ఆయనకు శాపం

ఏ కోస్తాలోనో పుట్టుంటే విశ్వమంత ప్రచారం వస్తుండే

అక్కినేని కంటే ముందే జయరాజ్‌కు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’

తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణోత్సవాల్లో గుర్తుకురాని జయరాజ్‌ పేరు

ఆంధ్రోళ్ల కుట్రలకు కనుమరుగైన జయరాజ్‌ చిత్ర చరిత్ర

విలక్షణ నటుడు, దర్శకుడిగా బాలీవుడ్‌లో బడా స్థానం

అత్యధిక రెమ్యూనరేషన్‌ పొందిన గొప్ప హీరో

తెలంగాణ ఫిలింసిటీకి జయరాజ్‌ పేరుపెట్టాలి

కుహనాచరిత్రకారుల కుట్రల్లో మసిబారిన కరీంనగర్‌ ముద్దుబిడ్డ పైడి జయరాజ్‌ చరిత్రపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం…

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : ‘ఉత్తర భారతీయ హీరోలను తలదన్నే రూపం ఆయనది..! ఉత్తమ నటన.. దర్శకత్వం అందించ గల నైపుణ్యం ఆయన సొంతం..!! హిందీ, ఉర్దూ, ఆంగ్ల, గుజరాతీ, మరాఠీ భాషల్లో కలిపి 156 చిత్రాల్లో నటించి బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలోనే అగ్రహీరోల సరసన చేరిన మేగనగధీరుడు..!! పరాయిగడ్డలోనూ తన నటనాకౌశలాన్ని వెండితెరపై ఒలకబోసి ఔరా అనిపించుకున్న అచ్చమైన తెలుగోడు..! అంతేకాదు.. తన నటనానైపుణ్యానికి విజయాన్ని దాసోహం చేసి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో కీర్తి గడించిన విలక్షణ హీరో..!! ఆయనే.. మన తెలంగాణ ముద్దుబిడ్డ.. పైడిజయరాజ్‌..!!! ఇంతటి పేరుగాంచిన నటుడిపై కుహనాచరిత్రకారులు కుట్రలు పన్నారు..! జయరాజ్‌ సినిమా చరిత్రపై మట్టికప్పారు..!! ఆయన ఆనవాళ్లు ఎక్కడా మిగలకుండా మూకుమ్మడిగా కుయుక్తులు పన్నారు..! అక్కినేని కంటే ముందే జయరాజ్‌కు ఫాల్కే అవార్డు దక్కినా.. ఆయన చరిత్ర వెలుగుచూడలేదు..!! జయరాజ్‌ సినిమా విజయ గాథను నలుగురికి పంచేందుకు ఇష్టపడలేదు..! యావత్‌ టాలీవుడే జయరాజ్‌ను విస్మరించింది..! తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవాల్లో సైతం.. తెలుగు బిడ్డడైన పైడి జయరాజ్‌ గురించి క్షణమైనా స్మరించుకున్న సందర్భం కనిపించలేదు..!! ఆంధ్రోళ్ల కుట్రల ఫలితంగానే.. జయరాజ్‌ సినిమా చరిత్ర కనుమరుగైంది..! ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మందికి తెలియకుండాపోయింది. ఆయన చరిత్రపై మట్టికప్పిన ఆంధ్రోళ్ల కుట్రలను ఖండిస్తూ.. ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం అందిస్తోంది.

పైడి జయరాజ్‌ జననం..

పైడి జయరాజ్‌ తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లాలో సెప్టెంబర్‌ 28, 1909లో జన్మించారు. జయరాజ్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెల సంతానం. ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇష్టం. సినిమాల్లో నటించాలని మహాకోరిక. ఆ మోజుతోనే.. ఆయన నిజాంకాలేజీలో చదువు పూర్తికాగానే 1929లో ముంబాయి చేరుకున్నారు. పైడి జయరాజ్‌ తెలంగాణ బిడ్డడు కావడంతో హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలు తెలుసు. ఈ మూడు భాషల్లోనూ ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. ఈ అంశమే జయరాజ్‌ బాలీవుడ్‌లో రాణించేందుకు కలిసొచ్చింది. అలాగే భారత గాన కోకిలగా అందరికీ సుపరిచితురాలైన సరోజినీనాయుడు పైడి జయరాజ్‌కు పినతల్లి కావడం విశేషం.

విజయ పథంలో జయరాజ్‌ తెరంగేట్రం…

పైడి జయరాజ్‌ 19 ఏళ్ల వయస్సులో ‘జగమతి జవానీ’ సినామాతో చిత్ర ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమా ద్వారానే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన ఇరవయ్యోయేట 1930లో ‘స్పార్కిలింగ్‌ యూత్‌’ అనే ‘మూకీ’ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఈ ఏడాదిలోనే ‘ట్రయంఫ్‌ ఆఫ్‌ లవ్‌’ అనే చిత్రంలో కథానాయకుడిగా నటనను ప్రారంభించారు. ఇలా జయరాజ్‌ మొత్తం 11 ‘మూకీ’ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 1931లో ప్రారంభమైన ‘టాకీ’  యుగంలోకి ‘పికారి’ అనే ఉర్దూ సినిమాతో ప్రవేశించారు. ఇలా తన నటనాకౌశలాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులతో ఔరా అనిపించుకున్నారు. పలువురు అగ్రహీరోల నుంచి ప్రశంసలు పొందారు పైడి జయరాజ్‌. బాలీవుడ్‌లో అప్పట్లో ఒక ఊపు ఊపుతున్న శాంతారాం, పృథ్వీరాజ్‌ కపూర్‌లాంటి పెద్ద హీరోల సరసన మరో పెద్ద హీరోగా పైడి జయరాజ్‌ స్థానం సంపాదించుకున్నారు. అలనాటి గొప్ప హీరోయిన్లయిన నిరుపారాయ్‌, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి నటీమణుల సరసన నటించి అనేక విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇలా బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో మొత్తంగా 11 మూకీ చిత్రాలు, 156 టాకీ చిత్రాల్లో నటించిన గొప్ప హీరోగా పేరుపొందారు. ఇవి కాకుండా.. విలన్‌ పాత్రలతోపాటు వివిధ రకాల పాత్రల్లో మొత్తం 300 సినిమాల్లో నటించారు. హిందీ, ఉర్దూ భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించి తెలుగోడి సత్తా ఏంటో చాటారు.

దర్శకత్వంలోనూ మేటి అనిపించుకున్నారు…

పైడి జయరాజ్‌ నటనకే పరిమితం కాకుండా దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. పలు సినిమాలకు ఉత్తమ దర్శకత్వం అందించి ప్రేక్షకుల చేత ప్రశంసలందుకున్నారు. పైడి జయరాజ్‌ మొహర్‌, రాజ్‌ఘర్‌, మాల, ప్రతిమ, సాగర్‌ అనే చిత్రాలకు దర్శకత్వం అందించారు. పిజె ఫిల్మ్స్‌ యూనిట్‌ పతాకంపై ప్రసిద్ధ నటిగా పేరుగాంచిన సర్గీస్‌ కథానాయికగా 1951లో ‘సాగర్‌’ చిత్రాన్ని నిర్మించాడు. దీంతో నిర్మాతగా కూడా పేరుతెచ్చుకున్నారు.

చారిత్రక పాత్రలకు ప్రాణం పోసిన పైడి…

పైడి జయరాజ్‌ ఎక్కువ సినిమాల్లో చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రల్లోనే నటించారు. ఆ పాత్రలకు ఆయన న్యాయం చేసేందుకు ఎనలేని కృషి చేశారు. ఆయన పోషించిన చారిత్రక నేపథ్యం కలిగిన పాత్రల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. ఎక్కువగా షాజహాన్‌, పృథ్వీరాజ్‌ చౌహాన్‌, రాణాప్రతాప్‌, టిప్పుసుల్తాన్‌, అల్లావుద్దీన్‌, చంద్రశేఖర ఆజాద్‌ లాంటి పాత్రలను గుర్తు చేసుకోవచ్చు. ఇంతటి ప్రాధాన్యత, ప్రతిష్ట కలిగిన పాత్రలను ధరించిన జయరాజ్‌ ఒక తెలుగువాడిగా ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేకపోయారు. ఇది బాధాకరం.

1950-60 వరకు జయరాజ్‌కు స్వర్ణయుగం…

బాలీవుడ్‌ సినిమా చరిత్రలో పైడి జయరాజ్‌ తనదైన ముద్ర వేసుకుంటూ ఉత్తమ నటనాకౌశలాన్ని ప్రదర్శించారు. అందుకుగాను ఆయనకు బాలీవుడ్‌ చిత్రసీమలో అవకాశాలు మెండుగా అందివచ్చాయి. 1930లోనే నెలకు రూ.100 చొప్పున రెమ్యూనరేషన్‌ అందుకునేవారు. ఆ తర్వాత ఆయన ప్రావీణ్యం మరింత పెరిగి రెమ్యూనరేషన్‌ ఒక్కసారిగా రూ.600లకు చేరింది. అందుకే.. జయరాజ్‌ అందుకుంటున్న రెమ్యూనరేషన్‌, వస్తున్న అవకాశాలను బట్టి ఆయనకు 1950-60 వరకు సర్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే జయరాజ్‌ నటనా ప్రావీణ్యానికి అనేక విజయాలు దాసోహమన్నాయి. అదే కోవలో 1982లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. ఈ అవార్డుతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనను సత్కరించి గౌరవించింది.

జయరాజ్‌ చిత్ర చరిత్రను గప్పిన ఆంధ్రోళ్లు…

ఒక తెలుగోడిగా పరాయి గడ్డపై ఇన్ని సినిమాల్లో నటించి, పలు చిత్రాలకు దర్శకత్వం అందించి కాలరు ఎగరేసిన పైడి జయరాజ్‌ సినిమా చరిత్ర కనుమరుగైపోయింది. భారత దేశ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. దీనికిగాను కళాకారులకు అందజేసే దేశ అత్యున్నత పురస్కారం అయిన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా దక్కింది. జయరాజ్‌ సేవలు, నటన నైపుణ్యాన్ని యావత్‌ దేశం గుర్తించి గానీ, తెలుగువారైన ఆంధ్రోళ్లు గుర్తించలేదు. జయరాజ్‌ సినిమా విజయాలను, ఆయన చరిత్రను ఎక్కడా వెలుగుచూడకుండా.. నలుగురికి తెలియకుండా మొత్తం ఆయన చరిత్రపైనే మట్టికప్పారు. టాలీవుడ్‌లో నటసామ్రాట్‌గా పేరుతెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావుకు 1991లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది. దీనికి అక్కినేని పేరును, ఆయన చరిత్రను ఊరూరా ప్రచారం చేశారు. ఆయనను ఒక దేవుడిగా భావించి పూజలు చేస్తున్నారు. ఆయన చరిత్రను వేనోళ్ల కీర్తిస్తున్నారు. కానీ.. ఇంతకంటే ముందే 1982లోనే ఈ అవార్డును సొంతం చేసుకున్న జయరాజ్‌ గురించి ఎక్కడా ప్రచారం చేయలేదు ఈ తెలుగు చిత్ర పరిశ్రమ అధిపతులు. దీన్నిబట్టి.. జయరాజ్‌ కేవలం తెలంగాణ గడ్డలో పుట్టినందుకే ఇలా చేశారని అర్థమవుతోంది. అదే ఏ కోస్తాలోనో.. ఏ ఆంధ్రాలోనో.. ఏ రాయలసీమలోనో పుట్టి ఉంటే.. జయరాజ్‌ పేరును కూడా వాడవాడలా తలిచేవారు. ఆయన విగ్రహాలను ఊరూరా ప్రతిష్టించేవారు. యావత్‌ తెలుగు చిత్రపరిశ్రమకే దేవుడిలా కొలిచేవారు. ఆయన చరిత్రను నలుదిశలా ప్రసరింపచేసేవారు. కానీ ఎక్కడా జయరాజ్‌ సినిమా చరిత్రను గానీ, ఆయన సాధించిన విజయాలను గానీ బయటికి పొక్కనివ్వలేదు. అదే అక్కినేని అవార్డులు, రివార్డులను బహిరంగంగా ప్రచారం చేశారు, చేస్తున్నారు. ఇలా ఆంధ్రా కుహనాచరిత్రకారులు తెలంగాణ మేథావుల చరిత్రను మట్టిలో కలుపుతున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో 90 శాతం మందికి పైడి జయరాజ్‌ చరిత్ర, ఆయన ఒక సినీనటుడు అన్న విషయం తెలియకుండాపోయింది.

టాలీవుడ్‌ స్వర్ణోత్సవాల్లోనూ గుర్తుకురాని జయరాజ్‌…

తెలుగు చిత్రపరిశ్రమ స్థాపించి గతేడాదితో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలో యావత్‌ తెలుగు చిత్రసీమ ప్రపంచమంతా కలిసి టాలీవుడ్‌ స్వర్ణోత్సవాలు నిర్వహించింది. అందులో.. ఒక తెలుగువాడిగా బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో ఘనమైన కీర్తిని గడించారని, అందుకు ఆయనను స్మరించుకోవాలని ఒక్కరంటే ఒక్కరు ఆలోచించలేదు. ఈ స్వర్ణోత్సవాల్లో కనీసం ఒక్క క్షణమైనా పైడి జయరాజ్‌ను స్మరించుకున్న సందర్భం ఒక్కటంటే ఒక్కటి కనిపించలేదు. ఇది చాలదా..? పైడిజయరాజ్‌ సినిమా చరిత్రను ఆంధ్రోళ్లు మట్టికరిపించారనడానికి. ఒక్క పైడి జయరాజే కాదు.. అన్ని రంగాల్లోనూ దేశమంతా అత్యున్నత ప్రతిభ కనబరిచిన తెలంగాణ బిడ్డలను చరిత్రను ఈ ఆంధ్రావలసవాదులు ఇలాగే మట్టిలో పూడ్చేశారు. తెలంగాణ మేథావుల చరిత్రను, వారి మార్గదర్శకాలను పదిమందికి పంచడానికి ఇష్టపడలేదు. ఇంతకంటే అవమానం ఏముంటుంది..? ఇంతకంటే అణిచివేత ఇంకెంతకావాలి..? అందుకే.. తెలంగాణ స్వరాష్ట్రంలోనైనా ఆంధ్రోళ్ల పెత్తనాన్ని.. వారి కుట్రలను తిప్పికొట్టేందుకు.. తెలంగాణ ప్రజల ప్రతిభాపాటవాలను నలుదిక్కులా విస్తరించేందుకు నడుంబిగించాలని, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసే తెలంగాణ ఫిలింసిటీ పైడి జయరాజ్‌ పేరు పెట్టాలని ‘జనంసాక్షి’ దినపత్రిక యావత్‌ తెలంగాణ ప్రజలందరి గొంతుకై నినదిస్తోంది.