చరిత్ర సృష్టించిన భారత్‌

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో ఆసీస్‌కు వైట్‌వాష్‌
మూడు రోజుల్లోనే ముగిసిన చివరి టెస్ట్‌
ఆసీస్‌లో పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా
81 ఏళ్ల భారత టెస్ట్‌ చరిత్రలో సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ, మార్చి 24 (జనంసాక్షి) :
టెస్ట్‌ క్రికెట్‌లో భారత్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. 81 ఏళ్ల చరిత్రలో సిరీస్‌లో పరిపూర్ణ విజయాలు సాధించి సత్తా చాటింది. గత ఆసీస్‌ టూర్‌లో ఎదురైన ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో నిర్వహించిన చివరి టెస్ట్‌ మూడు రోజుల్లోనే ముగిసింది. గింగిరాలు తిరిగే భారత స్పిన్నర్ల బంతులను అంచనా వేయడంలో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ పూర్తిగా విఫలమయ్యారు. చెన్నయ్‌లో ప్రారంభమైన ఆసీస్‌ పరాజయాల పరంపర ఢిల్లీతో పరిసమాప్తమైంది. భారత టెస్ట్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి.  నాలుగు టెస్టుల్లోనూ భారత్‌ పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 29 వికెట్లు తీయగా, ఓపెనర్‌ మురళీ విజయ్‌ నాలుగు టెస్టుల్లో కలిపి 430 పరుగులు చేశాడు. సిరీస్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు మహేంద్రసింగ్‌ ధోని (224), అరంగేట్రం చేసిన తొలిటెస్టులోనే అత్యధికంగా 187 పరుగులు చేసిన క్రికెటర్‌గా శిఖర్‌ ధావన్‌ చరిత్ర నమోదు చేశారు. చివరి మూడో రోజు బౌలర్ల హవా స్పష్టంగా కనిపించింది. ఒకేరోజు మొత్తం 16 వికెట్లు తీశారు.