చర్చలు లేవు

5

అర్థరాత్రి నుంచి ఆంధ్ర వాహనాలు పన్ను కట్టాల్సిందే

కోర్టు సూచనల మేరకే ఇంతకాలం ఆగాం : మంత్రి మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,మార్చి31(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై అంతర్రాష్ట్ర పన్ను విధానం పద్ధతిని అమలు చేస్తామని తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నెంబర్‌ 43 పై వెనక్కు తగ్గేదిలేదని పేర్కొన్నారు. పన్ను ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రైవైట్‌ ట్రావెల్స్‌ యజమానులు, ఏపీ ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో మహేందర్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం విూడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం నడుచుకుంటోందని,  ప్రైవేట్‌ ట్రావెట్‌ యాజమాన్యాలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఏకపన్ను విధానంతో నష్టపోయామని, రాష్ట్ర ఆర్థికాభివృద్దికి పన్ను భారం తప్పదని మహేందర్‌ రెడ్డి అన్నారు. దీనిపై ఇక ఎలాంటి చర్చలకు తావులేదని స్పష్టంచేశారు.

అయితే ఎపీ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను విధించే ఆలోచనని విరమించుకోవాలని ఏపీ రవాణ  శాఖమంత్రి శిద్దా రాఘవరావు తెలంగాణ సర్కారుని కోరారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అటు ఆంధ్రా ప్రాంతానికి కూడా వ్యాపారం, పుణ్య క్షేత్రాల సందర్శరార్థం  పెద్ద ఎత్తున తెలంగాణ వాహనాలు వస్తాయన్నారు. రవాణా పన్ను విషయంలో ఇరు రాష్టాల్ర కలిస్తే ఎవరిపైనా ఆర్ధిక భారం లేకుండా ఉంటుందని మంత్రి తెలిపారు. రవాణా పన్ను విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని  రాఘవరావు అన్నారు. సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ ఏపీలో అంతర్రాష్ట్ర పన్ను విధింపుపై ప్రస్తుతానికి ఆలోచన లేదన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత పన్ను విధింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము కూడా పన్ను వేస్తే కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల నుంచి సరుకుల ధరలు పెరుగుతాయన్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉన్నప్పుడు అనేక పనుల విూద రావడం జరుగుతుందని, ఇరు రాష్టాల్రనుంచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందని శిద్దా అన్నారు. పన్నులు వేస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్నారు.  ప్రజలు నష్టపోకూడదన్నదే తమ ఉద్దేశమని శిద్దా తెలిపారు.                     ఇక ఏపీ వాహనాలపై టీ సర్కారు విధించిన రవాణా టాక్స్‌ పై తనకు సమాచారం లేదని గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీలో అన్నారు.  పూర్తి సమాచారం అందిన తర్వాత స్పందిస్తానని ఆయన అన్నారు. ఇక మరోవైపు తెలంగాణలో ప్రవేశించే ఎపి వాహనాలకు పన్ను విధింపు వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ఎంట్రీ టాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్తుండడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆందోళన చెందుతున్నాయి. దీనిపై వాహనదారులు ఈరోజు(బుధవారం) హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు మంగళవారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్‌కు వాహనాలను నిలిపి వేయాలని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్ణయించాయి. ఏపీ వాహనాలపై పన్ను విధించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్‌) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో తైమ్రాసిక పన్ను చెల్లించినా ఆంధప్రదేశ్‌, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తోంది. హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఆంధప్రదేశ్‌ లారీ యజమానుల సంఘం చేసిన విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని  ప్రైవేట్‌ బస్సుల యజమానులు ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను ఆపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆంధప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వచ్చే ప్రైవేట్‌ బస్సులు భారీ సంఖ్యలో నిలిచిపోనున్నాయి. ఈ రోజు అర్థ రాత్రి నుంచి దాదాపు 80 శాతం బస్సులు నిలిపివేయనున్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణలో పన్ను వసూలు చేయనున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి నుంచి పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సుల యజమానులు సమావేశమై.. బస్సులు ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే బస్సులపై రవాణా పన్ను విధించడం సరికాదని ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ అన్నారు. ఒకేభాష మాట్లాడే రెండు రాష్టాల్ర మధ్య ఇలాంటి పన్నులు వసూలు చేయడం పద్ధతి కాదని ఆయన ఢిల్లీలో అన్నారు. బస్సులపై రవాణా పన్నువిధించడం వల్ల ప్రజలపైఅధిక భారం పడుతుందని, ఈ విషయంలో టీ. ప్రభుత్వం పునరాలోచించాలని జగన్‌ సూచించారు. పన్ను విధింపును మరో ఏడాది వాయిదా వియాలని బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సూచించారు. ఇప్పుడే ఈ విసయంలో తొందరపడవద్దన్నారు. దీనిపై పునరాలోచన చేయాలన్నారు.  అర్థరాత్రి నుంచి అంతర్‌ రాష్ట్ర పన్నువిధానం అమల్లోకి రానుంది. పన్నుల భారంపై ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు  సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రైవేటు బస్సుల్ని నిలిపివేయాలని నిర్ణయించారు. దాంతో  రాత్రినుంచి 80 శాతం ప్రైవేటు బస్సులు నిలిచిపోనున్నాయి. ముందస్తు రిజర్వేషన్లను పలు ప్రైవేట్‌ సంస్థలు ఇప్పటికే నిలిపివేశాయి.