చలో అసెంబ్లీకి అనుమతివ్వకపోతే మిలియన్‌ మార్చ్‌ పునరావృతం

హరీశ్‌ హెచ్చరిక
హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) :
చలో అసెంబ్లీకి అనుమతివ్వకపోతే మిలియన్‌ మార్చ్‌ పునరావృతం అవుతుందని, అక్రమ అరెస్టులతో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆపలేరని ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరామని చెప్పారు. అనుమతి ఇస్తే ప్రశాంతంగా జరుగుతుందని, లేకుంటే మరో మిలియన్‌ మార్చ్‌ పునరావృతం అవుతుందని తేల్చి చెప్పారు. అనుమతిస్తే ఆందోళనను శాంతియుతంగా నిర్వహిస్తామని, లేకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చలో అసెంబ్లీకి తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంను ఒప్పించాలని సూచించారు. అనుమతి ఇప్పించకపోతే మంత్రులంతా పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని కోరారు. టీజేఏసీ 14న తలపెట్టిన చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ నేతలు మంగళవారం ముఖ్యమంత్రిని కలిశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత చలో అసెంబ్లీ జరుపుకోవాలని సీఎం చెప్పారని తెలిపారు. చలో అసెంబ్లీ అనుమతిని పోలీసులు చూస్తారని సీఎం దాటవేయడం సరికాదన్నారు. రేపటి వరకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తెలంగాణపై మాట నిలబెట్టుకోకుండా సభా నాయకుడు చేతులెత్తేస్తే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కిరణ్‌, చంద్రబాబు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆరోపించారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇప్పించే బాధ్యత తెలంగాణ మంత్రులపై ఉందన్నారు. అనుమతి ఇస్తే తమ బాధ్యత అని లేకుంటే ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. చలో అసెంబ్లీ ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఏం తప్పులు చేశారని తెలంగాణ ప్రజలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా చలో అసెంబ్లీ కార్యక్రమం జరిపి తీరతామని తేల్చిచెప్పారు. లక్షలాది మంది హైదరాబాద్‌కు చేరుకొని ఆందోళనను విజయవంతం చేస్తారన్నారు. అన్యాయంగా, అక్రమంగా విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణపై టీడీపీ, కాంగ్రెస్‌ దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు బాగా నటిస్తున్నారని ఆరోపించారు. గన్‌పార్క్‌ దగ్గరకు వచ్చిన బాబు తెలంగాణ అమర వీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదని ప్రశ్నించారు. తెలంగాణకు తాము అనుకూలమని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు తెలంగాణపై తీర్మానం పెట్టాలని ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.