చలో అసెంబ్లీతో తెలంగాణ తడాఖ చారిత్రాత్మక ఘట్టం కావాలె

సీమాంధ్ర పార్టీలను బొందపెట్టాలె
నిజాం కాలేజ్‌ వేదికపై గర్జించిన కేసీఆర్‌
కేకే, వివేక్‌, మందా, వినోద్‌, జనార్దన్‌రెడ్డి తెరాసలో చేరిక
హైదరాబాద్‌, జూన్‌ 2 (జనంసాక్షి) :
చలో అసెంబ్లీతో తెలంగాణ తడాఖా చూపిస్తా.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటామని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అన్నారు. జూన్‌ 14న అసెంబ్లీని ముట్టడిరచి మరోమారు తెలంగాణవాదాన్ని ప్రపంచానికి చాటుతామని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని నిజాం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎంపీలు డాక్టర్‌ జి. వివేకానంద, మందా జగన్నాథం, మాజీ ఎంపీ కేశవరావు, మాజీ మంత్రి వినోద్‌, టీడీపీ, బీజేపీ నాయకులు ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. వారందరికి గులాబీ కండువా కప్పి కేసిఆర్‌ పార్టీలోని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, పార్టీలకతీతంగా ఉద్యమంలో పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. ఇదొక అరుదైన దృశ్యమని అభివర్ణించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకోవాలని కేశవరావును కోరుతున్నానన్నారు. తానుగానీ, తన కుటుంబ సభ్యులుగానీ ఎటువంటి పదవుల కోసం ఎన్నికల్లో పాల్గొనబోరని కేశవరావు స్పష్టం చేశారన్నారు. అది ఆయన త్యాగనిరతికి నిదర్శనమని కొనియాడారు. ఇదో పవిత్ర ఉద్యమం అలుపెరగకుండా కొనసాగుతున్న ఉద్యమం ఉద్యమాన్ని ఎవ్వరూ ఆపలేరు ముందుకు సాగుతోంది 13 ఏళ్లుగా ఉద్యమం కొనసాగుతున్నా ప్రజల ఆకాంక్షను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎందరో బిడ్డలు ఆత్మబలిదానాలు చేసినా గుడ్డిగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ గడ్డపై ఆంధ్రా పాలకుల అవసరం లేదన్నారు. ఆంధ్ర ప్రాంత పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్‌ సిపిలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ ఇలా అందరూ ఆంధ్ర వాళ్లేనని అన్నారు. తెలంగాణ వారిని వారు శాశ్వత గులాములుగా భావిస్తున్నారన్నారు. అందరం ఒకటిగా ఉందా ఒకటిగా పోరాడుదాం కాంగ్రెస్‌ పార్టీని బొంద పెడదాం తెలంగాణ జెండాను ఎగురవేద్దాం అని పిలుపునిచ్చారు. 42 రోజులపాటు సకల జనుల సమ్మె చేసినా, బస్సులను నిలుపుచేసినా ప్రభుత్వాలకు బుద్ధి రాలేదన్నారు. ఎంపీలు వివేక, మంద జగన్నాథం పార్లమెంట్‌లో తెలంగాణ కోసం కొట్లాడారన్నారు. తాను, విజయశాంతి తెలంగాణ కోసం పోరాడుతుంటే తమకు సంఫీుభావంగా వారంతా నిలిచి తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఎన్నోమార్లు చాటారన్నారు. తెలంగాణ రాదని, ప్రజా ఉద్యమంలో ఉండి సాధించుకుందామన్న లక్ష్యంతో వారందరూ నేడు తెలంగాణ ఉద్యమంలోకి అడుగు పెట్టారన్నారు. వారందరికి అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. స్వచ్ఛమైన మనసుతో వారు వస్తే వారిపై కేంద్రమంత్రి ఆజాద్‌ నీలాపనిందలు వేయడం విచారకరమన్నారు. బేరసారాలు ఎవరు జరిపారో ఎక్కడ జరిపారో ఆయనే తెలియజేయాలన్నారు. మాయమాటలతో ఇంకెంత కాలం తెలంగాణ ప్రజలను మోసంచేస్తారని ప్రశ్నించారు. నెలకు 30 రోజులు కాదంటాడు వారానికి ఏడు రోజులు కాదంటాడు, నేడు జూన్‌ నెల అని వ్యాఖ్యానించారు. ఏ సంవత్సరం, ఏ జూన్‌ నెలో ఆయనే స్పష్టం చేయాలన్నారు. 2014 జూనా? 2015 జూనా? తెలియజేయాలన్నారు. కొట్లాడి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. జూన్‌ 14నాటి అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామన్నారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. బలహీన వర్గాలకు 121 గజాలలో ఇల్లు నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. ఇదిలా ఉండగా తొలుత కేశవురావు మాట్లాడుతూ, ఇది ధర్మ యుద్ధమని చాటారు. అమరులకు జోహార్‌ అర్పిస్తున్నానని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి వాళ్లతో మమేకమై లక్ష్యం నెరవేర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమని తెలిపారు. తెలంగాణ కావాలనుకునే వారు ఉద్యమంలోకి అడుగిడాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమంతోనే తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. ఇదిలా ఉండగా, నేటి ఆత్మీయ సభలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డి, టీడీపీ నేతలు మర్రి జనార్దనరెడ్డి, వెంకటేష్‌ గౌడ్‌, డాక్టర్‌ నర్సయ్య, మందా శ్రీనాధ్‌, కె.విప్లవ్‌ తదితరులు ఉన్నారు.
నెల రోజులంటే..ఎన్ని రోజులో చెప్పాలి : మంద
మరో మారు మోసం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పాల్పడుతోందని నాగర్‌కర్నూలు ఎంపీ మందా జగన్నాధం ఆరోపించారు. నెలలోగా నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై మందా జగన్నాధం మండిపడ్డారు. నెలంటే 30 రోజులు కాదని.. వారం అంటే ఏడు రోజులు కాదని వ్యాఖ్యానించిన ఆజాద్‌ నెల రోజులంటే ఎన్ని రోజులో చెప్పాలని డిమాండు చేశారు. తొమ్మిదేళ్లుగా కోరుతునే ఉన్నామన్నారు. నిరసన తెలుపుతునే ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేందుకే టిఆర్‌ఎస్‌లో చేరుతున్నామని అన్నారు.
సర్వం మోసం.. : వివేక్‌
నాడు కేంద్ర హోం మంత్రి షిండే కూడా నెల రోజులేనని చెప్పి.. ఆ తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలిసిందేనని ఎంపి వివేక్‌ అన్నారు. అలాగే నేడు ఆజాద్‌ కూడా అదేతీరులో వ్యవహరించారని అన్నారు. అదిగో.. ఇదిగో.. అనడమే గాని.. తెలంగాణ ఇచ్చే ఉద్దేశం కాంగ్రెస్‌ పార్టీకి లేదన్నారు. బేరాసారాలు చేశామని ఆజాద్‌ వ్యాఖ్యానించారని, ఏ రకమైన బేరసారాలు చేశామో వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తున్నా మన్నారు. తెలంగాణ సాధించుకునేందుకే ప్రజా ఉద్యమ పార్టీలో చేరుతున్నామని అన్నారు.