చిరంజీవికి అంత సీన్‌లేదు!
రెండు స్థానాల్లో గెలుపు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆగ్రహం
సొంతూరులోనే వైఎస్సార్ సీపీ ప్రభంజనం
ఏలూరు, జూన్ 24 : ఉప ఎన్నికల పోరులో నర్సాపురం, రామచంద్రాపురం స్థానాల్లో కాంగ్రెస్ గెలపును తన ప్రతిభనే అంటూ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఉభయగోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పైకి ఎవరూ విమర్శల దాడి ప్రారంభించకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం చిరంజీవి వ్యాఖ్యలపై కస్సుబుస్సుమంటున్నారు. తిరుపతి స్థానంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేని చిరంజీవి కాపు సామాజిక వర్గంలో తనకేదో ఇంకా పరపతి ఉందంటూ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో చిరంజీవికి బాల్య దశ నుంచే విడదీయరాని అనుబంధం ఉంది.చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఇప్పుడైతే ఏర్పాటు చేశారో ఆయన వినిపించిన సామాజిక న్యాయం నినాదానికి ఉభయ గోదావరి జిల్లాల కాపులు విశేషంగా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్, టీడీపీలోని కాపు నేతలంతా ప్రజారాజ్యంపార్టీలోకి వెళ్లి చిరంజీవిక బ్రహ్మరథం పట్టారు. తీరా సొంత జిల్లా పశ్చిమగోదావరి జిల్లాలోనే పీఆర్పీ పుట్టి మునిగింది. 15 స్థానాలలో కేవలం తాడెపల్లిగూడెం స్థానంలోనే పీఆర్పీ గెలిచింది. జన్మనిచ్చిన నర్సాపురం నియోజకవర్గాన్ని కాదనుకుని అత్తగారి నియోజకవర్గమైన పాలకొల్లులో పోటి చేసిన చిరంజీవికి ఎదురైన ఘోర పరాజయం జ్ఞాపకాలను ఇప్పటికీ ఎవరూ మరచిపోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో తిరుపతిలో గట్టెక్కిన చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం కూడా కాపు సామాజిక వర్గానికి మింగుడు పడలేదు. విలీన ప్రక్రియను చాలా మంది వ్యతిరేకించినా చిరంజీవి మాత్రం తన పని తాను చేసుకుపోయారు. కిరణ్ క్యాబినెట్‌లో రెండు మంత్రి పదువలతో పాటు తానూ రాజ్యసభ పదవిని చేజిక్కించుకున్నారు. చిరంజీవి సన్నిహిత నేత కోటగిరి విద్యాధర్‌రావు ఎమ్మెల్సీ పదవిని ఆశించినా నిరాశే మిగిలింది. ఉప ఎన్నికల పోరులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని అడ్డుకునే శక్తిగా కాంగ్రెస్‌లో జనాకర్షణ నేతగా చిరంజీవిపై ఆశలు పెట్టుకున్న అధిష్టానానికి ఫలితాలు కంగుతినిపించాయి. తిరుపతిలో సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స చిరంజీవి కలిసికట్టుగా తిరిగి ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. ఇక నర్సాపురం స్థానంలో బొత్స, చిరంజీవి విస్తృతంగా ప్రచారచేశారు. తన స్వగ్రామమైన మొగల్తూరు గ్రామానికి వెళ్లకుండానే చిరంజీవి ప్రచారం ముగిసింది. వాస్తవానికి నర్సాపురం, రామచంద్రాపురంలలో చిరంజీవి ఎన్నికల ప్రచారానికి రావడానికి అక్కడి కాంగ్రెస్ నేతలు సమర్థించలేదు. చిరంజీవి వల్ల మేలు కన్నా జరిగే కీడే ఎక్కువన్న ఆందోళన వ్యక్తమైంది. నర్సాపురంలో గెలుపు సాధించిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి వ్యక్తి గతంగా ఉన్న చరిష్మకు తోడు, ఆయన పట్ల సానుభూతి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ప్రసాదరాజుపై వ్యతిరేకత కాంగ్రెస్ విజయానికి కారణంగా చెబుతున్నారు.ఈ స్థానంతో పాటు రామచంద్రాపురంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలుపును అక్కడి టీడీపీ వర్గాల క్రాస్ ఓటింగ్ కారణమనే విశ్లేషణ ఉండనేఉంది. మాజీ మంత్రి సుభాష్ చంద్రబోస్‌పై వ్యక్తమైన వ్యతిరేకత ఎన్నికల ముందు జరిగిన కొన్నిసంఘటనలు కాంగ్రెస్ విజయానికి కారణంగా చెబుతున్నారు. బోస్ సతీమణి ఎస్సీ వర్గాలను వేధించడం,ఉద్యోగాల పేరిట డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలు ఆయా వర్గాలను ఆయనకు దూరం చేశారు. వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే ఈ ఇద్దరి గెలుపును చిరంజీవి తన క్రెడిట్‌గా చెప్పుకోవడం దారుణమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి స్వగ్రామమైన మొగల్తూరులో ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్‌ను పరిశీలిస్తే వైఎస్సార్ సీపీకి 4,341 ఓట్లు లభిస్తే, కాంగ్రెస్‌కు పడిన ఓట్లు 3829 మాత్రమే. మొగల్తూరు మండలం మొత్తంమీద కాంగ్రెస్‌కు లభించిన ఓట్లు 19,489. ఇలా సొంత ఊరు, సొంత మండలంలోనే కాంగ్రెస్‌కు మెజారిటీ రాకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో చిరంజీవికి స్వగ్రామంలోనే పరపతి లేదన్న వాస్తవాన్ని కాంగ్రెస్ నేతలతో పాటు వైఎస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.