చివరిదశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నల్గొండ,జనవరి28(జనంసాక్షి): నల్గొండ ఉమ్మడి జిల్లాలో బుధవారం జరిగే చివరి విడత పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. అధికారులు తమ సన్నాహాల్లో ఉండగా, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేపట్టారు. ఊరూరా తిరుగుతూ ఓట్లను అబ్యర్థించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఓటరు గుర్తింపు కార్డు తీసుకురావాలని నల్లగొండ కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల వాటిలో ఏదో ఒకటి తెచ్చుకోవాలన్నారు. ఈ నెల 30న నల్లగొండ డివిజన్ పరిధిలోని నల్లగొండ ,తిప్పర్తి ,కనగల్ ,కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, నార్కట్‌పల్లి, చిట్యాల, శాలిగౌరారం, మునుగోడు, చండూరు మండలాల్లో జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు.డివిజన్ పరిధిలోని 257పంచాయతీలకు 16 పంచాయతీలు ,206 వార్డులు ఏకగ్రీవం అయినట్లు పేర్కొన్నారు. 214 సర్పంచ్ ,2014 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో 4982 మంది పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో 57సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించమన్నారు. 26 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ,29 కేంద్రాల్లో వీడియో గ్రాఫర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఓటరు ఓటు వేసేటప్పుడు ఓటరు స్లిప్‌తోపాటు 18రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైన ఒకటి వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎన్నికలు సజువుగా జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.