చెత్త శుద్ధి పై చిత్తశుద్ధి లేని పరిపాలన…చెత్తతో పాటు సగం కాలిన శునకం..
మంగపేట, సెప్టెంబర్ 30 (జనంసాక్షి):-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి,గ్రామాల పరిశుభ్రత కొరకు అనుక్షణం పరితపిస్తు ప్రతి నెల గ్రామపంచాయతీలకి లక్షల రూపాయల నిధులు జమ చేస్తుంది.అభివృద్ధి,పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలలో భాగంగా మంగపేట మండలం రాజుపేట గ్రామపంచాయతీలో ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను నిర్లక్ష్యంగా తగలబెడుతున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్డు నందు తడి చెత్త,పొడి చెత్త వేరుచేసి అందులోనుండి ఇనుము,గాజు, ప్లాస్టిక్,అట్టముక్కలు వేరు వేరుగా చేసి విక్రయించి వచ్చిన సొమ్మును గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉంది.కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటికి తిరిగి సేకరించిన చెత్తను శుద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనంగా మారిన రాజుపేట గ్రామపంచాయతీ.తడి చెత్త పొడి చెత్త వేరు చేయాల్సి ఉండగా తడి చెత్త పొడి చెత్త కలిపి తీసుకువచ్చి ఒకే చోట గుమ్మరించి వేరు చేయాల్సి వస్తుందని నెపంతో చెత్తను తగలబెడుతున్నారు,అందులో భాగంగా చనిపోయిన శునకంను ఖననం చేయాల్సి ఉండగా ఖననం చేయకపోగా ఆ శునకంను చెత్తతో పాటు దహనం చేస్తున్నారు. ఈ ఘటన గ్రామ పంచాయతీ అధికారుల యొక్క పనితీరుకే సాక్ష్యంగా నిలుస్తుంది. ఇందులో గ్రామపంచాయతీ అధికారి నిర్లక్ష్యం,మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ లోపమే అని రాజుపేట గ్రామపంచాయతీ ప్రజల ఆరోపిస్తున్నారు.