చెన్నై-కాచిగూడ రైలులో ..
అర్థరాత్రి దోపిడీకి యత్నం
– దోపిడీ దొంగలపై జీఆర్‌పీ పోలీసుల కాల్పులు
– రైలు దిగి పరారైన దొంగల ముఠా
తాడిపత్రి, జులై12(జనం సాక్షి) : అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు గ్రామంలోని రైల్వేస్టేషన్ వద్ద దోపిడీ దొంగల హల్‌చల్ చేశారు. వంగనూరు గ్రామ రైల్వేస్టేషన్ సవిూపంలో పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సిగ్నల్ వైర్లు కట్ చేశారు. ఆ సమయంలో చెన్నై నుంచి కాచిగూడ వెళ్తున్న ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్ (17651) సిగ్నల్ వ్యవస్థ పనిచేయకపోవడంతో స్టేషన్ సవిూపంలో ఆగిపోయింది. దీంతో సుమారు 8 మంది దోపిడీ దొంగలు ఎస్1 బోగీలోకి చొరబడ్డారు. ఓ మహిళా ప్రయాణికురాలి మెడలోని గొలుసును లాక్కోవడానికి ప్రయత్నం చేయగా ఆమె గట్టిగా కేకలు వేస్తూ దొంగను ప్రతిఘటించింది. బంగారు గొలుసు రెండు భాగాలుగా తెగిపోయి ఒక భాగం దొంగ చేతిలో ఉండిపోయింది. అరుపులు విన్న జీఆర్పీ పోలీసు దొంగలపైకి ఒక రౌండ్ కాల్పులు జరపగా దొంగల ముఠా అంతా రైలు నుండి దిగి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మహిళ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. గత 20 రోజుల్లో ఇలా సిగ్నల్ వైర్లు కట్ చేసి రైలు దోపిడీకి పాల్పడడం ఇది మూడోసారి.