చేయని నేరాలకు ఏళ్లతరబడి జైలు శిక్ష
ముస్లింలు, దళితులు, ఆదివాసీలపై కేసులు అధికం
వారి జనాభా శాతం కంటే ఖైదీల సంఖ్య హెచ్చు
ఆర్థిక అసమానతలే కారణం
నిమ్నకులాల ఖైదీలతో నిండుతున్న దేశీయ జైళ్లు
పోలీసు, న్యాయవ్యవస్థల్లో కానరాని నిమ్న జాతుల అధికారులు
ఖైదీల రేటు పెరుగుదలపై సచార్ కమిటీ ఆందోళన
ఇటీవల విడుదలైన నేషనల్ క్రైం రికార్డు బ్యూరో రిపోర్టుపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం
హైదరాబాద్, నవంబర్ 27 (జనంసాక్షి) : కోర్టుల్లో న్యాయం గెలుస్తదన్న మాట నిజమేగానీ.. గెలిచేదంతా న్యాయం కాదు. బెయిళ్లు, జైళ్లు కులాల ప్రాతిపదికపైనే ఆధారపడుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే.. న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థల్లో మనవాళ్లు లేకపోతే.. మనం జైళ్లలోనే మగ్గాలి. దేవతలకు, మేకల్నే బలిస్తారు.. పులుల్నికాదు. అక్షరాల అదే జరుగుతుంది. న్యాయం కొనుక్కోలేని బెయిల్ పిటీషన్‌కు డబ్బుల్లేని పేదలు చిన్న చిన్న నేరాలకే అండర్ ట్రయల్ ఖైదీలుగా మగ్గుతున్నారు. వాళ్లంతా బహుజనులే. అందుకు.. ఇటీవల కాలంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీ జాతులకు చెందిన ప్రజలపై నేరాలు బనాయించబడుతున్నాయి. ఇదే విషయాన్ని.. 2006లో జస్టిస్ సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక, ఇటీవల నేషనల్ క్రైం రికార్డు బ్యూరో సంస్థ ఇచ్చిన రిపోర్టు కూడా నొక్కి చెప్పాయి. ఈ నేపథ్యంలో.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జైళ్లలో ఖైదీలుగా మగ్గుతున్న ముస్లిం, దళిత, ఆదివాసీ ప్రజలపై ‘జనంసాక్షి’ దినపత్రిక ప్రత్యేక కథనం అందిస్తోంది.
నేషనల్ క్రైం రికార్డు బ్యూరో రిపోర్టు ప్రకారం…
దేశంలోని వివిధ జైళ్లు ముస్లింలు, దళితులు, ఆదివాసీ జాతులకు చెందిన ఎక్కువ మంది ఖైదీలతో నిండుతున్నాయని, తద్వారా జైళ్లలో రద్దీ పెరిగిందని నేషనల్ క్రైం రికార్డు బ్యూరో సంస్థ ఇటీవల ఒక రిపోర్టు విడుదల చేసింది. ఈ సందర్భంగా.. దేేశంలో ఈ జాతులకు చెందిన ఖైదీల సంఖ్య 53 శాతం ఉందని పేర్కొంది. 2012 నుంచి 2013 చివరి నాటికి జైళ్లలో పెరిగిన ఖైదీల సంఖ్య శాతాన్ని పరిశీలిస్తే.. 112.2 శాతంగా ఉన్నది 118.4 శాతానికి పెరిగింది. ఈ సంవత్సర కాలంలో భారత దేశంలో వివిధ జైళ్లలోని ఖైదీల సంఖ్య 4.2 లక్షలకు చేరింది. అందులో ఎక్కువ శాతం మంది ఈ మూడు కమ్యూనిటీలకు చెందినవారేనని తెలిపింది. వాస్తవానికి ఈ మూడు కమ్యూనిటీల వాస్తవ జనాభా 39 శాతం ఉంటే వారి ఖైదీల సంఖ్య మాత్రం 53 శాతంగా నమోదైంది. పోలీసుల ఎన్‌కౌంటర్లలో మరణించిన వారు కూడా ఈ మూడు కమ్యూనిటీలకు చెందిన ప్రజలే 90 శాతం ఉన్నారు.
2013లో కమ్యూనిటీల వారీగా ఖైదీలు, జనాభా శాతం…
2013 సంవత్సరంలో వివిధ కమ్యూనిటీల నుంచి నమోదైన ఖైదీలు, ఆయా కమ్యూనిటీల జనాభా శాతం ఈ విధంగా ఉంది. ముస్లింలు 13 శాతం జనాభా ఉంటే.. ఖైదీలు 20 శాతంగా నమోదయ్యారు. దళితుల జనాభా 17 శాతం ఉంటే.. ఖైదీలుగా 22 శాతం మంది నమోదయ్యారు. ఆదివాసీల జనాభా 9 శాతంగా ఉంటే.. ఖైదీలుగా 11 శాతం మంది నమోదయ్యారు. ఇలా ఈ మూడు కమ్యూనిటీలకు చెందిన ప్రజలపై వారి జనాభాకంటే ఎక్కువ మంది ఖైదీలుగా మాపబడ్డారు. వీరు చేసిన నేరాల్లో సమాజాన్ని అత్యంత కలవరపాటుకు గురిచేసే అంశాలు ఏమీ లేవని, అన్నీ అర్థం లేని నేరాలనేనని నిపుణులు పేర్కొన్నారు. ఈ కేసులన్నీ ఆర్థిక వెనుకబాటుతనంతో చేసిన పనులకే నమోదైనవని నిపుణులు చెబుతున్నట్లు రిపోర్టుల్లో తేలింది.
నిమ్న జాతుల అధికారులు లేకపోవడమే కారణం..
దేశంలోని పోలీసు, న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ముస్లింలు, దళితులు, ఆదివాసీ జాతులకు చెందిన ఉన్నతాధికారులు లేకపోవడం వల్ల ఈ మ్యూనిటీ ప్రజలపై అగ్రకులాల అధికారులు చేయని నేరాలకు శిక్షలు వేస్తున్నారు. అంతటితో ఆగకుండా జైళ్లకు పంపుతున్నారు. ఈ సమాజంలోని కొందరు అగ్రకులాల ప్రజలు నిత్యం చేస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసులు పెడుతున్నారని, మతం, కులతత్వంతో నేరాలకు పాల్పడుతున్నారనే నెపంతో వీరికి శిక్షలు వేస్తున్నారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ముస్లింలు, దళితులు, ఆదివాసీల జనాభా నిష్పత్తికనుగుణంగా పోలీసు, న్యాయవ్యవస్థలో ఉన్నతాధికారులు లేకపోవడంతో అసమతుల్య కారణాల వల్ల ముస్లింలు, దళితులు, ఆదివాసీలను వివిధ చట్టాల కింద మళ్లీ మళ్లీ అరెస్టు చేస్తున్నారు.
జస్టిస్ సచార్ కమిటీ ఏం చెప్పింది…?
కేంద్రప్రభుత్వం 2006 సంవత్సరంలో ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ఢిల్లీ హైకోర్టు మాజీ ముఖ్యన్యాయవాది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జస్టిస్ సచార్ కమిటీ కూడా పైవిధంగా నివేదిక ఇచ్చింది. అనేక కేసుల్లో ముస్లిం యువకులు నిర్దోషులుగా ఉన్నా వారు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో సంస్థ కూడా అదే చెప్పింది. ముస్లింలతోపాటు దళితులు, ఆదివాసీల పేదరికం సమాజంలో మరింత ప్రబలంగా ఉందని పేర్కొంది.
వివిధ జైళ్లలో ముస్లిం, దళిత, ఆదివాసీ ఖైదీల రేటు…
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న జైళ్లలో ముస్లిం, దళిత, ఆదివాసీలకు చెందిన ఖైదీల శాతం ఈ విధంగా నమోదైంది. అత్యధికంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జైళ్లలో మహిళా ఖైదీలకు కూడా స్థానం లేనంతగా పెరిగిపోతోంది. ఈ రాష్ట్రంలో 187.6 శాతం మందిని ఖైదీలను నమోదు చేశారు. దేశంలోనే ఇది ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో చత్తీస్‌ఘర్ 174.7 శాతం, ఢిల్లీ 153.8 శాతం, జార్ఖండ్ 118.5 శాతం, గోవా 112.0 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 107.6 శాతం మంది ఖైదీలు ఈ మూడు కమ్యూనిటీలకు చెందినవారుగా నమోదైనట్లు రిపోర్టు పేర్కొంది. ఇక దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మందకొడిగా ఉండడంతోనే ఈ నేరాల సంఖ్య పెరిగి ఖైదీల సంఖ్య కూడా పెరగుతోందని, దీంతో భారత న్యాయవ్యవస్థపై పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయని క్రైం బ్యూరో రిపోర్టు పేర్కొంది. దేశంలోని వివిధ జైళ్లలో ఈ మూడు కమ్యూనిటీలకు చెందిన 1,29,608 మంది నిర్దోషులుగా ఉన్న ఖైదీలున్నారు. అంతేకాదు.. భారతీయ జైళ్లలో 2,78,503 మంది విచారణ ఖైదీలు తమ తుది విచారణ ఫలితం కోసం ఏళ్లతరబడి నిరీక్షణ చేస్తున్నారని స్పష్టం చేసింది.
జైళ్లలో మరణాల సంఖ్యా ఎక్కువే…
పాపం.. చేయని నేరాలకు జైలుపాలైన ముస్లిం, దళిత, ఆదివాసీ ఖైదీలు మనస్థాపానికి గురై జైళ్లలో అనేక కారణాలతో మరణిస్తున్నారు. జైళ్లలో ఈ మరణాల సంఖ్యను గనుక పరిశీలిస్తే.. నిమ్నజాతుల బిడ్డలు ఇంత మంది చనిపోతున్నారా..? అనే బాధ కలగకమానదు. అనేక కారణాల వల్ల 2013లో చనిపోయిన వారి సంఖ్య 1,597 ఉంది. అందులో సాధారణ మరణాలు 1,482 అయితే.. 115 అసాధారణ మరణాలు సంభవించాయి. మొత్తం మరణాల్లో 92.8 శాతంగా సాధారణ మరణాలుగా తేలింది. ఈ మరణాల రేటు వివిధ రాష్ట్రాల్లోని జైళ్లలో ఈ కింది ఉంది. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 18 శాతం, రాజస్థాన్ 11 శాతం, తమిళనాడు 10 శాతం, హర్యానా 9 శాతం, మధ్యప్రదేశ్ 9 శాతం, ఢిల్లీ 8 శాతం, అస్సాం, గుజరాత్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 5 శాతం చొప్పున ఖైదీల మరణాల రేటు నమోదైంది. ఏదేమైనా.. దేశంలో ముస్లింలు, దళితులు, ఆదివాసీ ప్రజలు అన్యాయంగా జైలుపాలవుతున్నారని, జైళ్లలో ప్రాణాలు కోల్పోతున్నారని సచార్ కమిటీ నివేదిక, నేషనల్ క్రైం రికార్డు బ్యూరో రిపోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా జాతీయ దళిత ఉద్యమ నేత రమేష్ నాథన్ కూడా తన న్యాయవాద వృత్తిలో కూడా ఇదే విషయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అంతిమంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో సంస్థ 1995 నుంచి ప్రచురించిన నివేదికలన్నింటిలోనూ ముస్లింలు, దళితులు, ఆదివాసీ ప్రజలపై మోపుతున్న నేరాల సంఖ్యలో మార్పులేదని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య నానాటికీ పెరుగుతుందేగానీ తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
నిమ్నకులాలపై పోలీసు, రాజ్యం కుట్రలు మానాలి…
దేశంలో నిమ్న జాతులకు చెందిన ముస్లిం, దళితులు, ఆదివాసీ ప్రజలపై పోలీసులు, న్యాయవ్యవస్థలోని అత్యున్నత అధికారుల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆర్థిక సమస్యలను సాకుగా చూపి, కులం, మతంతో సాగుతున్న ఘర్షణలను ఎత్తిచూపి ఈ మూడు మ్యూనిటీ ప్రజలపై పోలీసులు, అత్యున్నత న్యాయస్థానాలు చేయని నేరాలకు శిక్షలు వేస్తున్నాయి. ఫలితంగా అమయాక ప్రజలను జైళ్లపాలు చేసి వారి జీవితాల్లో అంధకారం నింపుతూ.. అత్యున్నతస్థాయిలో చట్టాలను అమలు చేస్తున్న ఈ అగ్రకుల ఉన్నతాధికారులు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఈ ధోరణి ఇప్పటికైనా విడనాడి ముస్లిం, దళిత, ఆదివాసీ ప్రజల అభివృద్ధికి పాటుపడాలని పలువురు దళిత నాయకులు, మానవహక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.