చైనాలో భూకంపం

150 మందికి పైగా మృతి, వేలాది మందికి గాయాలు
బీజింగ్‌, (జనంసాక్షి) :
చైనాలోని సిచూన్‌ రావెన్స్‌ శనివారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి కకావికలమైంది. తీవ్ర భూకంపం దాటికి 150 మందికిపైగా మరణించగా దాదాపు 2,200 మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్‌ స్కెల్‌పై భూకంపం తీవ్రత 7గా నమోదైంది. 2008లో కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించి 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. యాన్‌ నగరానికి సమీపంలో లుషాన్‌ కౌంటిలో భూకంప కేంద్రాన్ని అమెరికా భూగర్భ పరిశోధన కేంద్రం గుర్తించింది. ఇక్కడ సుమారు 12 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. గాయపడిన వారిలో 150మంది పరిస్థితి విషమం గా ఉందని ఇప్పటికే 102మంది చనిపోయారని అధికారులు ఉటంకిస్తూ ప్రభుత్వ టెలివిజన్‌ పేర్కొంది. మృతుల సంఖ్య తగ్గించేందుకు వీలుగా అన్ని సహాయక చర్యలను  సత్వరమే తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌, ప్రధాని లీ కికియాంగ్‌ ఆదేశించారు. ప్రధాని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితులను రక్షించడంలో తొలి 24గంటలే అతి ముఖ్యమైనవని, ఈ గోల్డెన్‌ టైంలోనే ప్రాణాలను రక్షించడం ముఖ్యమని ప్రధాని లీని ఉటంకిస్తూ జిన్‌హువా వార్తా సంస్థ పేర్కొంది. దాదాపు ఆరువేల సహాయక బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని ఆ వార్తా సంస్థ పేర్కొంది. చంగ్‌డూ విమానాశ్రయం తెరచి ఉంచినప్పటికీ కేవలం ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే నగరంలోకి అనుమతిస్తున్నారని  ప్రభుత్వం టెలివిజన్‌ పేర్కొంది. శిథిలాల నుంచి 32మందిని ప్రాణాలతో రక్షించారని, వార్తా సంస్థ పేర్కొంది. భూకంపం పరిసర ప్రాంతంలోని గ్రామాల్లో భవనాలు, ఇళ్ళు కూలిపోయాయి. గాయపడిన వారికి అక్కడికక్కడే చికిత్స అందించడంలో వైద్యులు అహరహం కృషి చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.