చైనా 19 కి.మీ.ల దురాక్రమణ

లడఖ్‌ వాస్తవ పరిస్థితులపై
మంత్రి వర్గానికి  ఆర్మీ చీఫ్‌ వివరణ
న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) :
జమ్ము కాశ్మీర్‌లోని లడఖ్‌ ప్రాంతంలో చైనా దళాలు దుందుడుకు తనంగా భారత్‌ వైపు 19 కిలోమీటర్లు లోపలికి చొరబడటం, గుడారాలు వేయడం తదితర పరిస్థితులపై పరిష్కారం దిశగా తీసుకుంటున్న చర్యలను సైన్యాధిపతి జనరల్‌ విక్రంసింగ్‌ బుధవారం కేంద్ర మంత్రి వర్గానికి వివరణ ఇచ్చారు. ఈ సమస్యను  పరిష్కరించుకునే క్రమంలో మన ముందున్న పలు అవకాశాలపై ఈ సమావేశం లో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. చైనా సైన్యంతో ఇప్పటి వరకు జరిగిన మూడు ప్లాగ్‌  మీట్‌ విఫలం కావడం దౌలత్‌ బేగ్‌ ఓల్లి ప్రాంతంతో పాటు తూర్పు లడఖ్‌లో భారత సైన్యం చేసుకున్న ఏర్పాట్లను చైనా పట్టుబట్టడం తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. చైనా సైనికధికారుల మధ్య మంగళవారం చుషుల్‌ వద్ద బ్రిగేడియర్‌ స్థాయి అధికారుల మధ్య చివరి సమావేశం నిర్వహించారు. గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం చైనా దళాలు భారత భూభాగం నుంచి భేషరుతుగా వెనక్కి తగ్గాలని మన బ్రిగేడియర్లు స్పష్టం చేశారు. ఈ ప్లాగ్‌ మీట్స్‌ వల్ల ఫలాఇతమేది కనిపించకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటున్నాయన్నది వేచి చూడాల్సిందే.