ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌


తొమ్మిది మంది మావోయిస్టులు మృతి  కేకేడబ్ల్యూ కమిటీకి కోలుకోలేని దెబ్బ
భారీగా ఆయుధాలు స్వాధీనం
ఎన్‌కౌంటర్‌ కాదు.. కోవర్ట్‌ ఆపరేషన్‌ : వరవరరావు
ఖమ్మం, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు మంగళ వారం తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఖమ్మం జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో సుకుమా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టుల క్యాం పుపై అటు ఛత్తీస్‌గఢ్‌, ఇటు ఖమ్మం పోలీసు లతో పాటు సిఆర్‌పిఎఫ్‌, రిజర్వుడ్‌ పోలీసు బలగాలు పెద్ద ఎత్తునదాడులు నిర్వహించాయి. పోలీసు దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన మావోయిస్టులు ఎదురు కాల్పులు ప్రారంభిం చారు. పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో గుమిగూడి కాల్పులు   కొనసాగించాయి. సుమారు మూడుగంటలకు పైగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టల క్యాంప్‌ నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ల కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. టువర్తి, కుమ్మరి తోట వద్ద ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈదాడులకు సిఆర్‌పిఎఫ్‌ డిజి భగవత్‌ నేతృత్వం వహించిట్లు సమాచారం. 150 మంది మావోయిస్టులు ఒకే చోట సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో పకడ్బందీగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో  మృతిచెందిన తొమ్మిది మందిలో రాత్రిపొద్దుపోయే వరకు ఎనిమిది మందిని గుర్తించారు. మృతుల్లో కేకేడబ్ల్యూ ఏరియా కమిటీ సభ్యుడు రవి అలియాస్‌ సుదర్శన్‌, జిల్లా కమిటీ సభ్యురాలు పుష్ప, మాచెల్లి మండలం కామాపూర్‌కు చెందిన ఆరెల్లి వెంకట్‌ అలియాస్‌ కిరణ్‌, జిల్లా కమిటీ సభ్యురాలు సబిత అలియాస్‌ నర్సక్క (ఏటూరునాగారం), అజయ్‌ (వరంగల్‌), దుర్గం రాజు (బుట్టాయగూడెం, ఏటూరునాగారం), మడ్డి సీత అలియాస్‌ నవత (సూరేటిపల్లి, మంగపేట), బడే ఊర్మిళ ఉన్నట్టు గుర్తించారు. మరో మహిళ ఛత్తీస్‌గఢ్‌లోని భీజాపూర్‌కు చెందిన ఆదివాసీ మహిళగా భావిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో కేకేడబ్య్లూ కమిటీ కోలుకోలేని దెబ్బతింది.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో జరిగింది కౌంటర్‌ కాదు, కోవర్ట్‌ ఆపరేషనేనని విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావు అన్నారు. ఎక్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందారన్న పోలీసుల ప్రకటనపై ఆయన మండిపడ్డారు. పక్కా కోవర్ట్‌ ఆపరేషన్‌తోనే పోలీసులు విప్లవకారుల్ని మట్టుబెట్టారని తెలిపారు. వారు తినే అన్నంలో విషం కలిపి, మృతదేహాలపై యాసిడ్‌ పోసి తగలబెట్టారని పేర్కొన్నారు. తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందినా ఒక్క పోలీసూ గాయపడకపోవడం ఇది కోవర్ట్‌ ఆపరేషనేనని ధ్రువీకరిస్తుందన్నారు. ఇటీవల జార్ఖండ్‌లో చేసినట్టుగానే పక్కా సమాచారంతో మావోయిస్టులను కిరాతకంగా హతమార్చారని తెలిపారు.