జంబి గద్దె,బతుకమ్మ స్థలం కబ్జా
ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం * పట్టించుకోని మున్సిపల్ అధికారులు భీమ్‌గల్ ప్రతినిధి (జనంసాక్షి):హిందువులు సంప్రదాయంగా జరుపుకునే పండుగలలో దసరా పండుగ ఒకటి.దసరా, బతుకమ్మ వేడుకలను భీమ్‌గల్ మున్సిపల్ పరిధిలోని నందిగల్లీ లోని నందీశ్వర ఆలయం ముందర ఉన్న ప్రభుత్వ స్థలంలో వందల సంవత్సరాల నుండి ఉత్సవాలను గ్రామకమిటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు.అదే స్థలంలో శివరాత్రి పండుగ సందర్భంగా అగ్ని గుండాలు దున్నుతారు.ఇప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేసి మూడు షాపింగ్ మడిగెలు నిర్మిస్తున్నారు.అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మహిళ ప్రజాప్రతినిధి భర్త మడిగెల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో భీంగల్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన స్థానిక కౌన్సిలర్లు అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారని భీంగల్ ప్రజలు మండిపడుతున్నారు.ఇప్పటికే దసరా, బతుకమ్మ వేడుకలకు స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న కాస్త స్థలాన్ని కబ్జా చేస్తే దసరా, బతుకమ్మ సంబరాలను ఎక్కడ చేసుకోవాలని భీంగల్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతి లేకుండా దౌర్జన్యం గా మడిగెలు నిర్మిస్తున్నారు.మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా దసరా,బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా భీమ్‌గల్ ప్రజలు,మహిళలు వేలాది సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు.గురువారం నాడు గ్రామకమిటి సభ్యులు అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు.ఈ అక్రమ నిర్మాణం పై పలువురు రచ్చ రచ్చ చేశారు.అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని గ్రామకమిటి సభ్యులను నిలదీశారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని దసరా, బతుకమ్మ స్థలం భవిష్యత్తులో కబ్జాకు గురికాకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని భీమ్‌గల్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.