జగదీశ్‌ రెడ్డికే మళ్లీ మంత్రిగా ఛాన్స్‌


గుత్తాకు తదుపరి విస్తరణలో అవకాశం?
గొంగిడి సునీతకు ఇప్పట్లో అవకాశం లేనట్లే
నల్లగొండ,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జిల్లా నుంచి మళ్లీ జగదీశ్వర్‌ రెడ్డికే చాన్స్‌ దక్కనుందని స్పష్టం అయ్యింది. గుత్తా సుఖేందర్‌ రెడ్డి, గొంగిడి సునీతల పేర్లు పరిశీలనకు వచ్చినా పరిమితుల దృష్ట్యా కేవలం ఒక్కరికే చాన్స్‌ రానుందని తెలుస్తోంది. దీంతో మళ్లీ సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికే మంత్రి పదవిదక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. ఈసారి అన్ని జిల్లాల్లో సీనియర్‌ నాయకులు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన యువ నాయకులు కూడా అదే బాటలో ఉన్నారు. పదవులు తక్కువగా ఉండటం, ఆశావహులు సంఖ్య భారీగా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా  పడుతూ వచ్చిందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి పదవి ఆశిస్తున్న జగదీశ్‌రెడ్డి, నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరూ తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే మహిళలు, వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం కత్తివిూద సామే కావడంతో భారీ కసరత్తు జరిగినట్లు తెలిసింది.ముఖ్యమంత్రికి సన్నిహితుడైన జగదీశ్‌రెడ్డికి మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. అలాగే నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో తాను బాధ్యుడిగా ఉండి కష్టమైన స్థానాల్లో సైతం పార్టీని విజయతీరాలకు చేర్చారు. గతంలో కేసీఆర్‌ హావిూ, ఎన్నికల్లో పనితీరు ఫలితంగా ఎంపీకి మంత్రి పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. ప్రస్తుతమున్న మంత్రులు, విస్తరణలో భర్తీ చేస్తే పదవులను కలిపితే మంత్రుల సంఖ్య 12కు మించదు. గరిష్ఠంగా మంత్రుల సంఖ్య 17 కావడంతో మరోసారి విస్తరణ ఉంటుంది. ఆ సమయంలో గుత్తాకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మరో రెండు నెలల్లో పార్లమెంటు ఎన్నికలు
జరగనున్నాయి. ఇవి ముగిసిన తర్వాత మరోసారి విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.