జగన్‌కు మళ్లీ చుక్కెదురు

బెయిల్‌ పిటిషన్‌ కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, మే 9 (జనంసాక్షి) :
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో మరోమారు భంగపాటు కలిగింది. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన జగన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలాగే, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌నూ న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వజాలమని స్పష్టం చేసింది. ఇక, ఆడిటర్‌ విజయసాయిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ను    మొదటి పేజీ తరువాయి
జగన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్‌ ఇవ్వాలని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. జగన్‌ అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడ్డారని, కేసు కీలక దశలో ఉన్నందున ఆయనకు బెయిల్‌ ఇవ్వరాదని సీబీఐ చేసిన వ్యాఖ్యలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్‌ బయటకు వస్తే సాక్ష్యాలన్నీ తారుమారు అవుతాయని, దర్యాప్తు ప్రక్రియకు భంగం కలుగుతుందని పేర్కొంది. అక్రమాస్తుల కేసులో జగనే అంతిమ లబ్ధిదారు అని తెలిపిన న్యాయస్థానం.. ఆయన కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు హవాలా మార్గంలో వచ్చాయ నేందుకు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారని, అందుకు ప్రతిఫలంగా ఆయా సంస్థలకు/ వ్యక్తులకు భారీగా భూకేటాయింపులు జరిపా రన్న సీబీఐ వాదనలతో ధర్మాసనం పూర్తిగా ఏకీభవించింది. ఆర్థిక నేరాలు జరిగినట్లు సీబీఐ ఈ నెల 6న అందజేసిన రహస్య నివేది కలో ఆధారాలు ఉన్నాయని వెల్లడించింది. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది. జగన్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందన్న సీబీఐ ఆందోళనతో ఏకీభవించిన న్యాయ స్థానం.. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపింది. జగన్‌ కేసులో సీబీఐ అందజేసిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉన్నందున బెయిల్‌ ఇవ్వలేమంటూ జగన్‌ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ సంద ర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత మూడేళ్లుగా ఆర్థిక నేరాలు పెరిగి పోయాయని, ఆర్థిక నేరాల వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. .కేసు విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది అశోక్‌ భాన్‌ చేసిన వ్యాఖ్య లతో సుప్రీంకోర్టు పూర్తిగా ఏకీభవించింది. జగన్‌ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక నేరానికి పాల్పడ్డారని భాన్‌ వాదించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో జగన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు. పక్కా ప్రణాళిక ప్రకారం, ఉన్నత స్థాయిలో రహస్యంగా సాగే ఆర్థిక నేర లను ఉపేక్షించ కూడదన్నారు. ఆవేశం తన్నుకొచ్చినప్పుడు ఓ హత్య జరగొచ్చు కానీ, ఆర్థిక నేరం అలాంటిది కాదని, ముందస్తు ప్రణాళిక, స్పష్టమైన లెక్కలతోనే ఇది సాధ్యమని తెలిపారు. కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోయి, దేశ ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేస్తున్నాయని అశోక్‌ బాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ లాంటి వారికి బెయిల్‌ ఇస్తే ఆర్థిక నేరగాళ్లకు లైసెన్స్‌ ఇచ్చినట్లవుతుందని, ఇలాంటి వారిని వదిలిపెడితే భవిష్యత్‌ తరాలకు చెడు సంకేతం వెళ్తుందని.. ఏం చేసినా తప్పించుకోవచ్చనే భావన కలుగుతుందని.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని అశోక్‌భాన్‌ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు కీలక దశలో ఉన్న తరుణంలో ప్రధాన ముద్దాయికి బెయిల్‌ ఇస్తే సాక్షుల్ని బెదిరించి దర్యాప్తు పక్కదారి పట్టించే ప్రమాదముందని పేర్కొన్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి బయట ఉండి సాక్షులను బెదిరిస్తున్నారని.. ఏ1గా ఉన్న జగన్‌ బయటికి వస్తే ఏం జరుగుతుందో ఊహించవచ్చని పేర్కొన్నారు. జగన్‌ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్ల రూపాయాల అక్రమ లేవాదేవీలకు పాల్పడ్డారని, ఆయన అక్రమాలు దేశంలోనే కాక మరో ఏడు దేశాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. సమాచారం కోసం ఆయా దేశాల్లో తమ అధికారులు పర్యటించి విచారణ జరుపుతున్నారని చెప్పారు. అలాగే, భారతి, ఇండియా, పెన్నా సిమెంట్స్‌ ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ధి పొందాయని, ప్రతిఫలితంగా జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయన్నారు. విదేశాల నుంచి సమాచారం వచ్చేందుకు సమయం పడుతుందని, మొత్తవ్మిూద నాలుగు నుంచి ఆర్నెల్లలోపు దర్యాప్తు పూర్తి చేసి తుది చార్జిషీట్‌ దాఖలు చేస్తామన్నారు. సీబీఐ వాదనలు, సమర్పించిన నివేదికతో ఏకీభవించిన జస్టిస్‌ సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. అదే సమయంలో జగన్‌ తరఫు న్యాయవాదులు చేసిన కొన్ని వాదనలతోనూ ఏకీభవించింది. సీబీఐ దర్యాప్తుకు గడువు విధించాలన్న జగన్‌ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు.. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొన్ని మిగిలిన అంశాలపై త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదిక దాఖలు చేయాలని స్పష్టం చేసింది.