జగన్‌ పాదయాత్రతో అధికార టిడిపిలో గుబుల

వచ్చేది జగనన్న రాజ్యమే అన్న సునీల్‌కుమార్‌

చిత్తూరు,జూలై13(జ‌నం సాక్షి): పేదప్రజల బతకుల్లో వెలుగులు నింపేందుకు నవరత్నాలాంటి సంక్షేమ పధకాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగనన్న పాదయాత్రలో ప్రజల చెంతకు వస్తున్నాడని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. 2019లో పార్టీ అధికారం రాగానే ప్రజలు రాజన్న పాలను చూడబోతున్నారని చెప్పారు. పేద ప్రజల సంక్షేమమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మళ్ళీ రాజన్న పాలనను తీసుకువచ్చేందుకు గత ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పధకాలు ప్రజలతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపిందన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసాతో రైతులకు, వైఎస్సార్‌ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. వృద్దులకు, వికలాంగులకు వెయ్యి నుండి 2 వేల రూపాయల ఫించన్‌ పెంపు, అమ్మబడి ద్వారా విద్యార్థులకు నగదు ప్రొత్సాహాలను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ , ఆరోగ్యశ్రీ నిధులు, నిరుపేదలకు 25 లక్షల ఇండ్ల నిర్మాణాలు, జలయజ్ఞంతో రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తి, మధ్యపాన నిషేదం పధకాలతో నవ్యాంద్రను అభివృద్ధి బాట వైపుకు తీసుక వెళ్ళనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రకటించిన ప్రతి పధకాన్ని గ్రామాలకు వెళ్ళి ప్రజలకు తెలియజేస్తామన్నారు. పాదయాత్ర ద్వారా జగనన్న ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు హావిూలపై ప్రజలకు నమ్మకం పోయిందని పేర్కొన్నారు.కనీస అవగాహనలేని లోకేష్‌ను మంత్రిని చేశారని, ఆయన ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదన్నారు. ప్రజలు టీడీపీకి చరమగీతం పాడనున్నట్లు చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయలని పిలుపునిచ్చారు. దొడ్డిదారిన ఆర్థికమంత్రి అయిన యనమల రామకృష్ణుడికి ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని, ఆయన మంచి ఆర్థిక మంత్రి ఎందుకు కాలేకపోయారని అన్నారు. యనమలకు

చంద్రబాబుకు చెంచాగిరి చేయడంతోనే సరిపోతోంది. ఆయన వయసులో పెద్దవారు కానీ…మాటల్లో పెద్దరికం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడానికి కారణం యనమలే. ఏ దేశం వెళితే ఆ దేశం డిజైన్లు చెప్పడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. చంద్రబాబు డిజైన్లు అన్నీ గ్రాఫిక్స్‌. నాలుగేళ్లుగా గ్రాఫిక్స్‌ చూసి చూసి జనం విసిగిపోయారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన చిన్న చిన్న హావిూలే దిక్కులేదు కానీ రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని నిర్మాణంపై రోజుకో డిజైన్‌ విడుదల చేస్తున్నారు. అదేంటని అడిగితే రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షం అడ్డుపడుతుందని ఎదురుదాడి చేస్తున్నారు. ప్రతిపక్షం అడ్డుకుంటుందని చెప్పడం ప్రభుత్వం చేతకానితనం తప్ప మరొకటి కాదని అన్నారు.