సర్కారీ వైద్యులు పనిచేసే చోటే ఉండాలి

– రాత్రిళ్లు కూడా వైద్యసేవలు అందించాలి
– అలా జరగకుంటే ఓ ఉత్తరం రాయండి చర్యలు తీసుకుంటాం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌
హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : వైద్యులు రాత్రిళ్లు కూడా పనిచేసే చోట ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన శనివారంనాడు ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాజమండ్రిలోని మధురపూడికి ప్రత్యేక హెలికాప్టర్‌లో చేరుకున్నారు. ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రి పల్లంరాజు, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నర్సింహం, తదితరులు ఉన్నారు. అక్కడి నుంచి గోకవరం గ్రామానికి చేరుకున్నారు. స్థానిక పిహెచ్‌సిలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేశారు. అక్కడి రోగులను, రోగుల బంధువులను, స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్యులు రాత్రిళ్లు కూడా పనిచేసే చోట ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిఎం అండ్‌ హెచ్‌వో, కలెక్టర్‌తో చెప్పారు. ఒకవేళ అలా జరగకపోతే తనకు ఒక ఉత్తరం ముక్క రాయండి. ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ‘అనేక సమస్యలున్నాయి. ఆ విషయం తెలుసు. వాటన్నింటిని పరిష్కరిస్తా. అందుకే ఈ పథకం చేపట్టామన్నారు’. ప్రభుత్వం నిధానంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అధికారులు కొద్దిగా చురుకుగా వ్యవహరించకపోవడం వల్ల కొన్ని సమస్యలు నెలకొన్నాయన్నారు. వాటన్నింటిని ప్రజల సమక్షంలో పరిష్కరించేందుకే ఇందిరమ్మ బాట చేపట్టామన్నారు. గ్రామంలోని పిహెచ్‌సిని 25 పడకల స్థాయికి పెంచాలా.. 50 పడకల స్థాయికి పెంచాలా అనే విషయంపై ప్రతిపాదనలు పంపించమని చెప్పానన్నారు. అలాగే ఒక నెల రోజుల్లోగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రంపచోడవరం చేరుకున్న ఆయన అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రంపచోడవరంలో జూనియర్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను చేపడతామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి నిధులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టంగా అమలు చేస్తామని చెప్పారు.