జబర్దస్తీ పన్ను వసూళ్లపై ప్రజల నిరసన
వరంగల్,ఫిబ్రవరి14(జనంసాక్షి): గ్రామాల్లో పన్ను వసూళ్లకు దౌర్జన్య పద్దతులపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎలాంటి నోటీసలుఉ లేకుండా ఇంట్లో సామాన్యు పట్టుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారుల తీరును ఎండగడుతన్నారు. అయితే గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయని జిల్లా పంచాయతీ అధికారి ఈఎస్ నాయక్ అన్నారు. దీంతో గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలకు ముందుకు వెళ్ల లేకపోతున్నామని అన్నారు. 65 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని దీనివల్ల గ్రామాల్లో సేవలను సక్రమంగా అందించలేకపోతున్నామన్నారు. వంద శాతం వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ సిబ్బంది గ్రామాల వారీగా తిరుగుతున్నారు. జిల్లాలో 50 గ్రామాలు మాత్రమే వంద శాతం పన్నులు చెల్లించినట్లుగా డీపీవో ఈఎస్ నాయక్ తెలిపారు. బకాయిలను రాబట్టడానికి ప్రత్యేకంగా బృందాలను వేసినట్లుగా చెప్పారు. వీరంతా కేటాయించిన గ్రామాలలో ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేయాలని ఆదేశించినట్లుగా చెప్పారు. జిల్లాలోని 980 గ్రామపంచాయతీలోని ఇంటి, నల్లా పన్నులతో పాటు దుకాణాలు, మార్కెట్లు, ప్రభుత్వ ఆస్తులను అద్దెకివ్వడం తదితర అంశాలకు సంబంధించించిన బకాయిలు మొత్తం 78.53 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలు రూ.53.90 కోట్లు ఉన్నాయి. మార్చి 31వ తేదీ లోపు బకాయిలను వసూలు చేయాలని 50 మండలాలలో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించామన్నారు. కార్యదర్శులను బృందంగా ఏర్పాటు చేసి ఇంటింటికి తిప్పుతూ వసూళ్లకు కార్యాచరణ చేపట్టామన్నారు. ప్రజలంతా సహకరించి పన్నులు చెల్లించాలని లేకుంటే గ్రామాల అభివృద్ది కుంటుపడుతుందన్నారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి చెప్పినట్లుగానే గ్రామాలలో పంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్లు చేపడుతున్నారు. చెల్లించని వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కట్టనివారి ఇళ్లలోని సామగ్రిని గ్రామపంచాయతీలకు తరలించడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎలాంటి డిమాండ్ నోటీసులు ఇవ్వకుండా పన్నుల వసూళ్లకు పాల్పడటంపై ప్రజలు మండిపడుతున్నారు.