జర్నలిస్టులకు కనీస అర్హతుండాలి ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కట్జూ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :
జర్నలిస్టులకు కనీస విద్యార్హత కలిగి ఉండాలని ప్రెస్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ మార్కండేయ కట్జూ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లకు కనీస ఉన్నట్లే జర్నలిస్టులకు కూడా ఉండాలని ఆయన పేర్కొన్నారు. దీనిపై రెవాన్‌ గార్గవ్‌ అధ్యక్షతన కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు. విలేకరులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని, దీంతో వారు స్వేచ్ఛగా పనిచేయలేక పోతున్నారని ఆయన చెప్పారు. జర్నలిస్టులకు వచ్చే పారితోషికంతో వారి కుటుంబాలు పోషించుకోలేక పోతున్నాయని, వారికి జీతాలు పెంచాల్సిన అవసరం పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా యాజమాన్యాలపై ఉందన్నారు. ఇదిలా ఉండగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ రెండు పత్రికలు వివరణలు తీసుకోకుండా వార్తలు రాస్తున్నాయని, అది సరికాదన్నారు. సర్కూలేషన్‌, టీఆర్పీ రేటింగ్‌ కోసం ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడం మానుకోవాలన్నారు .