జర్నలిస్టు జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి…

జమీర్ కు నివాళులర్పించిన జర్నలిస్టులు

గద్వాల రూరల్ జులై 16 (జనంసాక్షి):- విధి నిర్వహణలో అమరుడైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం ఆదుకోవాలని జోగుళాంబ గద్వాల్ జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు.‌ శనివారం గద్వాల్ పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో విధి నిర్వహణలో అమరుడైన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జమీర్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వారు‌ కోరారు. జగిత్యాల జిల్లాలో వరదలు కవరేజ్ చేయడానికి వెళ్లి వాహనంతో రిపోర్టర్ జమీర్ వరద ఉధృతిలో కొట్టుకోపోవడం బాధాకర విషయమని, ఇలాంటి విపత్కర సమయంలో జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకొని విధులు నిర్వహించాలని అన్నారు…ప్రమాదవశాత్తు మృతి చెందిన జర్నలిస్ట్ లను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వార్తా సేకరణలో ఎంతో మంది జర్నలిస్టులు అసువులు బాసారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోలేదని అన్నారు. జమీర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.‌అలాగే సంభందిత ఛానెల్ యాజమాన్యం సైతం తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు. వరదల సమయంలో వార్త సేకరణకు ప్రాధాన్యతని ఇస్తూనే తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ శ్యాం, వెంకటేష్,హెచ్,శ్రీనివాస్, ధరూర్ రవి,శ్రీను,విల్సన్, చుక్క సుదర్శన్,గోకారి,బలరాం, మల్లీఖర్జన్,రాజు,గౌడ్,మధు,ఇస్మాయిల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు పాల్గొన్నారు.