జర్నలిస్టు 94 రోజుల దీక్ష

2
అక్రమ నిర్భంధానికి నిరసన

హెబ్రూన్‌,ఫిబ్రవరి 26(జనంసాక్షి): వర్తమాన ప్రపంచంలో భారత ఉక్కు మహిళ ఇరోం శర్మిల(15 ఏళ్లు) తర్వాత రికార్డు స్థాయిలో నిరాహార దీక్ష చేసిన పాలస్తీనా జర్నలిస్ట్‌ మొహమ్మద్‌ అల్‌ ఖెక్‌ ఎట్టకేలకు దీక్ష విరమించారు. తన అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ 94 రోజులగా ఖెక్‌ చేపట్టిన నిరాహారదీక్ష నేటితో ముగిసిందని ఆయన భార్య ఫైహా శుక్రవారం అంతర్జాతీయ విూడియాకు వెల్లడించారు. 33 ఏళ్ల అల్‌ ఖెక్‌.. సౌదీకి చెందిన ఓ వార్తా సంస్థలో రిపోర్టర్‌. విధినిర్వహణలో భాగంగా గత ఏడాది నవంబర్‌ 21న  పాలస్తీనా సరిహద్దుకు వెళ్లిన అతణ్ని ఇజ్రాయెల్‌ సైన్యం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఖెక్‌ కు ఉగ్రవాద సంస్థ హమస్‌ లో సంబంధాలున్నాయని ఆరోపించిన ఇజ్రాయెల్‌.. విచారణకు అవకాశం లేకుండా  ఖెక్‌ ను అత్యవసర నిర్బంధ(అడ్మినిస్ట్రేటివ్‌ డిటెన్షన్‌) చట్టం కింద కేసులు నమోదు చేసింది. అయితే తాను నిర్దోషినని మొదటినుంచి వాదిస్తోన్న ఖెక్‌.. జైలులో పెట్టిన నాలుగో రోజు నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఖెక్‌ అక్రమ నిర్బంధంపై ఆయన భార్య ఫైహా పెద్ద పోరాటమేచేశారు. పాలస్తీనా పాలకులు కూడా అందుకు మద్దతు తెలపడంతో జర్నలిస్టయిన ఖెక్‌ ను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి ఇజ్రాయెల్‌ కు సూచించింది. దీంతో ఇజ్రాయెట్‌ సుప్రీంకోర్టు అతని విడుదల చేసేందుకు సమ్మతించింది. అయితే మూడు నెలల తర్వాత అంటే మే 21న ఖేక్‌ ను విడుదల చేయాలని కోర్టు చెప్పింది. విడుదల ఖరారు కావడంతో జైలు ఆసుపత్రిలో ఉన్న ఖేక్‌ 94 రోజుల దీక్ష విరమించారు. ఇజ్రాయెల్‌ లో అత్యవసర నిర్బంధం కింద జైళ్లలో మగ్గిపోతోన్నవారి సంఖ్య 600కు పైనే ఉంటుందని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థల అంచనా.