జలమండలి సై తెలంగాణ

తెరాస అభ్యర్థి హరీశ్‌ గెలుపు
మొన్న ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ..
నేడు జలమండలిలో గెలుపు
హైదరాబాద్‌లో బలపడుతున్న మనవాదం
టీడీపీకి డిపాజిట్‌ గల్లంతు
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి) :
రాష్ట్ర రాజధానిలో తెలంగాణవాదం బలపడుతోంది. మొన్న ఆర్టీసీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ వాటర్‌బోర్డులోనూ పాగా వేసింది. ఎన్నికల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్యానల్‌, మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు విక్రం గౌడ్‌ ప్యానల్‌పై ఘన విజయం సాధించింది. వాటర్‌బోర్డులో పాగా వేసేందుకు టీబీజీకేఎస్‌, కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ సర్వశక్తులూ ఒడ్డాయి. హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదని చాటేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను అనేకరకాలుగా ప్రలోభపెట్టింది. అయినా వారు లొంగలేదు. తెలంగాణవాదానికి ఓటేసి కాంగ్రెస్‌ను చావుదెబ్బతీశారు. జలమండలిలో మొత్తం 3,784 ఓట్లు ఉండగా, హరీశ్‌రావుకు 1,547 ఓట్లు, విక్రంగౌడ్‌కు 1,449 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో హరీశ్‌రావు ప్యానల్‌ 98 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ‘వాటర్‌బోర్డులోని ఉద్యోగులు తమ కష్టాలు తీర్చేది టీబీజీకేఎస్‌ అని నమ్మారు. తమ ఓట్ల ద్వారా సీమాంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణలోని ద్రోహులకు బుద్ధి చెప్పాలని నిర్ణయానికి వచ్చారు. అందువల్లనే భారీ విజయం సాధ్మమైందని’ టీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు.

కాగా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి డిపాజిట్‌ కోల్పోవడం విశేశం. వాని నమ్మకాన్ని వమ్ము చేయబోమని తెలంగాణ సాధన కోసం ముందుండి పోరాడుతామని హరీశ్‌రావు చెప్పారు. ఇంతకాలం హైదరాబాద్‌లో తెలంగాణవాదం లేదని బూటకపు మాటలు చెప్పే పెట్టుబడిదారి శక్తులు ఈ గెలుపుపై ఏం మాట్లాడతాయని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఎంత బలీయంగా ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారో ఈ ఎన్నికల ద్వారా స్పష్టమైందని అన్నారు.