జల సాధన సమరానికి సిద్ధం కండి

దుశార్ల సత్యనారాయణ
వరంగల్‌, మే 20 (జనంసాక్షి) :
జల సాధన సమరానికి సిద్ధం కావాలని జల సాధన సమితి రాష్ట్ర చైర్మన్‌ దుశార్ల సత్యనారాయణ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ ఎస్‌డీఎల్‌సీఈ సెమినార్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును మనం కాపాడుకోవాలని, మన న్యాయమైన వాటా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర సర్కారు అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. ఈ సందర్భంగా మూడు తీర్మానాలు చేశారు. ఇచ్చంపల్లిని త్వరతిగతిన పూర్తి చేసి ఉత్తర తెలంగాణను ఏడారి కాకుండా కాపాడాలని డిమాండ్‌ చేశారు. చెరువులు, కుంటలను మరమ్మతు చేసి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ప్రతి ఇంట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. సతీశ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎన్‌ఐటీ విశ్రాంత ప్రొఫెసర్‌ పాండురంగారావు గోదావరి బేసిన్‌పై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. జల సాధన సమితి చేస్తున్న పోరాటాన్ని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా జల సాధన సమితి వరంగల్‌ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌, కార్యదర్శిగా సతీశ్‌, సహాయ కార్యదర్శులుగా దాసరి శ్రీనివాస్‌, తాడిశెట్టి క్రాంతికుమార్‌ను నియమించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రొటెక్షన్‌ ఫోరం అధ్యక్షుడు దాస్యం విజయ్‌ భాస్కర్‌, రిటైర్డ్‌ ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ రమ, రిటైర్డ్‌ డీఈ యాకిరెడ్డి, స.హ. చట్టం ఉద్యమకారుడు రాకేశ్‌, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్‌, శ్యాంగౌడ్‌, తాడిశెట్టి రాజేశ్వర్‌రావు, కొత్తూర్‌ జేఏసీ, టీ ఇంజినీర్స్‌ జేఏసీ బాధ్యులు పాల్గొన్నారు.