జాప్యం జరిగిందని మరణ శిక్షను మార్చలేం : సుప్రీం

ఖలిస్థాన్‌ మిలిటెంట్‌ పిటిషన్‌ తిరస్కరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 12 : మరణ శిక్ష అమలులో జరుగుతున్న జాప్యం కారణంగా ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పు చేయలేమని  సుప్రీంకోర్టు శుక్రవారం నాడు స్పష్టం చేసింది. దేవేందర్‌ పాల్‌ సింగ్‌  భుల్లార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రభావం మరణశిక్ష  ఎదుర్కొంటున్న మరో 16 మందిపై ప్రభావం చూపనుంది. 1993లో ఢిల్లీలో యువజన కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట కారుబాంబు పేలుళ్ల సంఘటనకు సంబంధించి భుల్లార్‌ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. ఈ శిక్ష అమలులో జాప్యమవుతున్నందునా తనకు క్షమాభిక్ష ప్రసాదించి యావజ్జీవ ఖైదుగా మార్పు చేయాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. బుల్లార్‌ క్షమాభిక్ష పిటిషన్‌ ఎనిమిదేళ్లుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో అతని భార్య కోర్టులోనే ఉన్నారు. తన అభ్యర్థనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఆమె తెలిపారు. ఎంతో కాలంగా ఆయన జైలులో ఉన్నందునా అతని మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, అతని బంధువులు, స్నేహితులు తెలిపారు. కాగా క్షమాభిక్ష పిటిషన్లను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యం జరగడం అమానుషం. అంతేకాక రాజ్యాంగంలోని 21వ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని భుల్లార్‌ న్యాయవాదులేకాక మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా నేటి సుప్రీంకోర్టు తీర్పు రాజీవ్‌గాంధీ హంతకుల కేసులో శిక్ష అనుభవిస్తున్నవారిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజీవ్‌ హత్య కేసులో పాత్ర ఉందన్న ఆరోపణలపై 22ఏళ్లపాటు జైలులో ఉన్న ముగ్గురిపై ఈతీర్పు ప్రభావం ఎలా ఉంటుందనే విషయంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. 11 ఏళ్ల అనంతరం 2011లో వారి క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. తమిళనాడులోని అన్ని రాజకీయపార్టీలు వారికి ఉరిశిక్ష విధించవద్దంటూ విజ్ఞప్తి  చేశాయి కూడా.